ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్ తో రసవత్తరంగా జరిగిన కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ నిలకడగా కొనసాగుతోంది. ఇంగ్లండ్‌ గడ్డపై కఠినమైన పరిస్థితుల్లో భారత జట్టు అసాధారణంగా పోరాడింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా, భారత బ్యాటర్లు అద్భుతంగా ఆదుకున్నారు.

రవీంద్ర జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడుతూ టెస్ట్ కెరీర్‌లో 5వ శతకాన్ని నమోదు చేశారు. మరోవైపు, ఇంగ్లండ్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొని, వాషింగ్టన్ సుందర్ తన మొదటి టెస్ట్ శతకాన్ని సాధించారు. చివరికి మ్యాచ్ డ్రాగా ముగియగా, భారత జట్టు అద్భుతమైన బ్యాటింగ్‌తో ఓ తక్కువ స్కోరు నుంచి పునరాగమనం చేసి గెలిచినంత ఫలితాన్ని సాధించింది. ఇప్పుడు సిరీస్ ఫైనల్ టెస్టుతో ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది.

భారత్ తొలి ఇన్నింగ్స్ – స్థిరమైన ఆరంభం

కాగా, ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి సెషన్‌ను వికెట్ లేకుండా ముగిస్తూ 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే క్రిస్ వోక్స్ రాహుల్‌ను (46) అవుట్ చేయగా, లియమ్ డాసన్ జైస్వాల్‌ను (58) ఔట్ చేశాడు.

సాయి సుధర్షన్ చక్కగా ఆడినప్ప‌టికీ 61 ప‌రుగుల వ‌ద్ద‌ వికెట్ పారేసుకున్నాడు. ఇక రిషభ్ పంత్ మొదట గాయపడ్డా, తర్వాతి రోజు బరిలోకి వచ్చి కీలక పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ (41), వాషింగ్టన్ సుందర్ (27) సమర్థవంతంగా సహకరించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 5/72తో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు.

ఇంగ్లండ్ దూకుడు – భారీ లీడ్

టీమిండియా తొలి ఇన్నింగ్స్ కు ప్రత్యుత్తరంగా ఇంగ్లండ్ విరుచుకుపడింది. ఓపెనర్లు క్రాలీ – డకెట్ 166 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ఇక వీరి విజృంభ‌ణ‌కు జడేజా బ్రేక్ ఇచ్చాడు. క్రాలీ (84)ని జ‌డ్డూ అవుచ్ చేయ‌గా.. డకెట్ (94)ను కంబోజ్ పెవిలియన్ పంపించారు.

అనంతరం క్రీజ్ లోకి వ‌చ్చిన‌ రూట్ – పోప్ 144 పరుగులు జతచేశారు. రూట్ తనదైన శైలిలో 150 పరుగులు చేసి, టెస్ట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాత రెండవ స్థానానికి చేరుకున్నాడు. స్టోక్స్ కూడా 141 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, కార్సే 47 పరుగులు చేశాడు. దీంతో, ఇంగ్లాండ్ మొత్తం 669 పరుగులు చేసి భారతదేశంపై 311 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

భారత్ రెండో ఇన్నింగ్స్ – ఘోర ఆరంభం

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు దారుణమైన ఆరంభం లభించింది. తొలి ఓవర్‌లోనే ఓపెన‌ర్ జైస్వాల్ – సుదర్శన్‌లను వోక్స్ అవుట్ చేయడంతో స్కోరు 0/2 గా నిలిచింది. అప్పటికే ఒత్తిడిలో ఉన్న భారత జట్టును రాహుల్ – గిల్ ఆదుకున్నారు. ఈ జోడీ 188 పరుగుల భాగస్వామ్యం తో భారత్‌ను ఆదుకుంది. రాహుల్ 90 పరుగుల వద్ద స్టోక్స్ బౌలింగ్‌కు పెవిలియన్ చేరగా, గిల్ తన శతకం (103) పూర్తి చేశాడు.

మిగిలిన పని జడేజా – వాషింగ్టన్ సుందర్ చూసుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను బాగా ఎదుర్కొంటూ, గట్టిగా డిఫెండ్ చేస్తూ 203 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. చివరకు ఇద్దరూ శతకాలు నమోదు చేశారు. భారత ఆటగాళ్లు చివరి వరకు ధైర్యంగా నిలబడి మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు కృషి చేశారు.

Leave a Reply