INDIA | హద్దు మీరుతున్న బంగ్లాదేశ్

INDIA | హద్దు మీరుతున్న బంగ్లాదేశ్
INDIA | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నిన్నమొన్నటిదాకా ప్రగతి బాట పడుతున్న దేశంగా గుర్తింపు పొందిన బంగ్లాదేశ్.. నేడు సైనిక ఆధిపత్యం, మతోన్మాదానికి కేర్ ఆఫ్ గా మారుతోంది. సరిగ్గా నాలుగు రోజుల నాడు ఢాకాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు పంపింది. భారత భూభాగం నుంచి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా (Former Prime Minister Sheikh Hasina) రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది.
ఇండియాలో (India) ఉంటున్న హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ కు చెందిన కొందరు నేతలు బంగ్లా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా ఆరోపణలు చేసింది. గత ఏడాది ఆగస్టులో హింసాత్మక నిర సనలతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన అనంతరం 2026 ఫిబ్రవరి 12న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరుగు తున్న వేళ.. హసీనా సాకుతో బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ మీద ఒంటికాలి మీద లేవటం వెనక ఉన్న కారణాలేంటో అందరికీ తెలిసిందే.
INDIA | న్యూఢిల్లీ గమనిస్తూనే ఉంది

హసీనా పతనం తర్వాత ఆమె పార్టీ అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించని అక్కడి తాత్కాలిక మహమ్మద్ యూనస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని వెనకుండి నడిపిస్తున్న సైన్యం.. భారత వ్యతిరేకతను రాజేయటానికి అవిశ్రాంతంగా చేస్తున్న ప్రయత్నాలనూ న్యూఢిల్లీ (New Delhi) గమనిస్తూనే ఉంది. తమ దేశంలోని పశ్చిమ పాకిస్థాన్ గా పిలవబడే ప్రాంతంలోని ప్రజల భాషను, సంస్కృతిని ఆనాటి పాక్ పాలకులు తృణీకరించిన ఫలితంగా 1971లో ఆ ప్రాంతం లో ఒక గొప్ప తిరుగుబాటు వచ్చింది.
బెంగాలీ స్థానంలో ఉర్దూను అధికారిక భాషగా.. పాక్ పాలకులు నిర్ణయించటం, ప్రజాస్వామికంగా గెలిచిన ముజిబుర్ రెహ్మాన్ (Mujibur Rahman) కు అధికార పగ్గాలు అప్పగించటానికి నిరాకరించటమే గాక బెంగాలీ ముస్లింలు.. పాక్ పాలనకు పనికిరారని ప్రకటించటంతో పశ్చిమ పాకిస్థాన్ ప్రాంతంలోని ప్రజలు రెహ్మాన్ నాయకత్వంలో స్వతంత్ర దేశం కావాలని నినదించారు.
INDIA | భారత్ తనదైన శైలిలో

భౌగోళికంగా ఈ ప్రాంతం మనదేశం లోని పశ్చిమ బెంగాల్ (West Bengal) ను ఆనుకుని ఉండటం, సాంస్కృతికంగా ఇక్కడి ప్రజలతో మనకున్న విడదీయరాని అనుబంధం కారణంగా నాటి భారత ప్రభుత్వం అక్కడి ప్రజా పోరాటానికి అన్ని విధాలుగా అండగా నిలిచింది. ముక్తివాహిని పేరుతో అక్కడ ఆయుధాలు చేపట్టిన స్వాతంత్ర పోరాట యోధులకు భారత సేనలు వెన్నుదన్నుగా నిలిచాయి. ఈ పోరాటాన్ని అణిచి వేసేందుకు పాక్ కొన్ని విదేశీ శక్తులను ఆహ్వానించినా..భారత్ తనదైన శైలిలో ఆ శక్తులకు చెక్ పెట్టి.. అంతిమంగా బంగ్లాదేశ్ అనే పేరుతో ఒక స్వతంత్ర దేశపు ఆవిర్భావానికి ప్రాతిపదికను ఏర్పరచింది.
1971 డిసెంబరు 3న మొదలైన యుద్ధం 13 రోజుల పాటు కొనసాగి.. సరిగ్గా డిసెంబరు 16న ముగియగా, ఇదే రోజు 90 వేల మంది పాకిస్థాన్ సైన్యం తమ ఆయుధాలు వదిలి, భారత్ సైన్యం (Indian Army) ముందు మోకరిల్లటంతో ఆ పోరు ముగిసింది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కర్త, కర్మ, క్రియగా నిలిచిన భారత్ ఆ తర్వాత కూడా అన్నివిధాలుగా ఆ దేశానికి అండగా నిలిచింది.
INDIA | మనదేశంతో అత్యధిక దూరం

బంగ్లాదేశ్ కు (Bangladesh) మూడువైపులా భారత్తో సరిహద్దు ఉంది. మనదేశంలోనిపశ్చిమ బెంగాల్, అసోం, మిజోరం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంది. రెండు దేశాల మధ్య మొత్తం 4,096.7 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉండగా అందులో ఒక్క పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్యే సుమారు 2,200 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మనదేశంతో అత్యధిక దూరం సరిహద్దు పంచుకునే దేశమూ బంగ్లాదేశే. ఆ దేశంలో మౌలిక సదుపాయాలు, రక్షణ పరమైన వ్యవస్థలు, ఆహార భద్రత, టెక్నాలజీ బదలాయింపు వంటి కీలక అంశాలలో నాడు భారత్ అండగా నిలిచింది.
ఆ తర్వాత ఆ దేశంలో వచ్చిన రాజ కీయ తిరుగుబాట్ల మూలంగా పదిహేనేళ్లు ఆ దేశం సైనిక పాలనలో ఉండి పోవటం, తిరిగి 2009లో పోరాట బంగ్లా యోధుడైన షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె.. హసీనా నాయకత్వం లోని అధికారంలోకి రావటంతో నాటి నుంచి గత ఆగస్టు వరకు భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉచ్ఛస్థితిలో నిలిచాయి. ఈ 15 సంవత్సరాలలో, ఆ దేశంలోని మిలిటెంట్ (Militant) గ్రూపులను తిప్పికొట్టడం, బంగ్లా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవటం, విద్యుత్, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు భారత్ ఆ దేశానికి విశేష మద్దతును అందించింది.
INDIA | మైనారిటీ హిందువులపై పెరుగుతున్న దాడులు

అయితే, గత ఆగస్టు ప్రారంభంలో షేక్ హసీనా (Sheikh Hasina) ప్రభుత్వం కూలిపోవడంతో అంతా మారిపో యింది. నేడు భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు తీవ్ర సంక్షోభంలో పడిపోయాయి. హసీనా అధికారం నుంచి వైదొలిగి భారత్లో తలదాచుకోవడంతో ఆ దేశంలోని అతివాద గ్రూపులు పేట్రేగి పోతున్నాయి. మైనారిటీ హిందువులపై పెరుగుతున్న దాడులు, ఈ దాడులను నిరసించిన అంతర్జాతీయ కృష్ణచైతన్య సంస్థ బంగ్లాదేశ్ విభాగం మాజీ సభ్యుడైన చిన్మయ కృష్ణదాసు ఢాకాలో దేశ ద్రోహం నేరం కింద అరెస్టు చేయడం దీనికి పరాకాష్ఠ. బంగ్లా దేశ్లో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టగానే ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయవలసి వచ్చింది.
షేక్ హసీనా కుటుంబం పట్ల బంగ్లా పౌరుల్లోని తీవ్ర వ్యతిరేకత.. నేడు భారత్ (India) వ్యతిరేకతగా అక్కడ రూపుదిద్దుకుం టోంది. అదే సమయంలో మహమ్మద్ యూనస్ నేతత్వంలో ఏర్పడిన అక్కడి తాత్కాలిక ప్రభుత్వం.. భారత్కు వ్యతిరేకంగా మారుతూ.. చైనా, పాకిస్థాన్లకు దగ్గరవుతోంది. తాజాగా పాక్, బంగ్లాదేశ్ లు ఇరు దేశాల పౌరులకు వీసా నిబంధన లలో వివిధ సడలింపులను ఇచ్చాయి. అలాగే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా, కరాచీ నుండి ఒక కార్గోషిప్ ఇటీవల బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంది.
INDIA | బంగ్లాదేశ్ విముక్తి కోసం

ఇరు దేశాల మధ్య తొలిసారిగా సముద్ర రవాణా సంబంధాల ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది నుంచి ఇస్లామా బాద్ – ఢాకా మధ్య ఎయిర్ కనెక్టివిటీ కూడా ప్రారం భమవుతుందని బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ (Pakistan in Bangladesh) హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ సమయ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్ అనుకూల నేతగా పేరున్న షేక్ హసీనాను గద్దె దించడంలో పాక్, చైనా అనుకూల శక్తులు కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు ఆ శక్తులే సైన్యం వత్తాసుతో యూనుస్ ను కీలుబొమ్మలా మార్చి ముందు పెట్టుకొని భారత వ్యతిరేకతతో కూడిన తమ రహస్య ఎజెండాను అమలుచేస్తున్నాయి. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్ పై భీకర పోరు సలిపిన భారత్కు ఇది జీర్ణించుకోలేని పరిణామమే. మరోవైపు, మన దేశంలో తల దాచుకున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని యూనుస్ జారీచేస్తున్న ప్రకటనలను హద్దులు మీరిన ప్రవర్తనగానే చెప్పాల్సి ఉంది. దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా పీఠమెక్కిన ఆయన భారత్ వ్యతిరేక ఎజెండాను బహిరంగంగా అమలు చేస్తూ వచ్చారు.
INDIA | భారత వ్యతిరేక ధోరణులు

ఈ క్రమంలోనే బాంగ్లాదేశ్ లోని ‘అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్’ హసీనాకు నవంబర్ 17వ తేదీన మరణ శిక్ష విధించింది. దీంతో శిక్ష అమలుకు ఆమెను తమకు అప్పగించాలని పదే పదే బంగ్లా సర్కారు న్యూఢిల్లీని కోరటంతో ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు మొదలై తారస్థాయికి చేరాయి. అక్కడి సైన్యంలోని ఉన్నధికారి భారత్ను ముక్కలు ముక్కలు చేయటమే తమ లక్ష్యం అని బహిరంగంగా ప్రకటించే స్థాయికి ఈ ద్వేషం చేరింది. మన దేశం పురుడు పోసిన బంగ్లాదేశ్ (Bangladesh) ఇలాంటి భారత వ్యతిరేక ధోరణులు నెలకొనడం నిజంగా విషాదమే. అయితే, ఈ సమస్యకు ఒక చక్కని ముగింపు నిచ్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో న్యూఢిల్లీ దౌత్యపరమైన చాణక్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. లేకపోతే.. అక్కడి జీహాదీ శక్తులు తూర్పు భారతం మీద పవిత్ర యుద్ధానికి వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.
