ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుదిపోరుకు సమయం ఆసన్నమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా-న్యూజిలాండ్ ఫైనల్ పోరుకు దుబాయి క్రికెట్ స్టేడియం వేదికగా ప్రరంభమైంది.
తొలి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా అజేయంగా ఫైనల్‌కు చేరుకోగా, రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
ఇక రెండు జట్ల మధ్య తుది సమరం ఈరోజు (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతుంది. కాగా, ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మరోసారి టాస్ ఓడిపోయాడు. ఇక న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
జట్టు మార్పులు:
న్యూజిలాండ్: గాయం కారణంగా మాట్ హెన్రీ జట్టుకు దూరమయ్యాడు దీంతో అతని స్థానంలో నాథన్ స్మిత్ తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
న్యూజిలాండ్ : విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జామిసన్, విలియం ఓ’రూర్కే
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
సమవుజ్జీలుగా భారత్ – కివీస్
అయితే, భారత్ ఫైనల్ చేరడంతో.. ఫైనల్స్ కు దుబాయ్ వేదికగా మారింది. పాక్‌లో పర్యటించిందేకు టీమిండియా నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇకపోతే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు జరుగుతుంది.
ఈ టోర్నీలో వరుసగా 4 మ్యాచ్‌ల్లో గెలిచి ఓటమెరుగని జట్టుగా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా మంచి ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. అదే జోరుతో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను అందుకోవాలనే కసితో ఉంది.
మరోవైపు, లీగ్ దశలో టీమిండియా చేతిలో ఓటమిపాలైన న్యూజిలాండ్… సమిష్టి ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఫైనల్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత్‌ను ఓడించి… లీగ్ దశలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది.
న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బలంగా ఉంది. టీమిండియాను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా కివీస్ ఈ ఫైనల్లోకి అడుగుపెడుతుంది. దీంతో ఫైనల్ మ్యాచ్ లో భారత్ కు గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. బలబలాల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నాయి. దాంతో ఫైనల్ పోరు హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి.
25ఏళ్ల కసితో టీమిండియా..
ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలపడటం ఇది మూడోసారి. గత రెండు ఫైనల్స్‌లోనూ కివీస్ భారత్‌పై విజయం సాధించింది. 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తొలిసారిగా తలపడ్డాయి.
ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి తొలి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత ఈ రెండు జట్లు 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్ భారత్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.
అయితే, ఇప్పుడా ఓటములకి ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా సిద్ధమైంది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ దశలోని ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించిన టీమిండియా… ఫైనల్‌లో కూడా కివీస్‌ను మట్టికరిపించి టైటిల్‌ను చేజిక్కించుకోవాలని చూస్తుంది.
ఈ మ్యాచ్ లో గెలిచి గత రెండు పరాజయాలకు టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా… లేక న్యూజిలాండ్ హ్యాట్రిక్ ఫైనల్ విజయాలు సాధిస్తుందా అనేది చూడాలి.