IND vs ENG | భారత్‌ 471 పరుగులకు ఆలౌట్ !

లీడ్స్ : హెడింగ్‌లీ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసి ఆలౌటైంది. రిషభ్ పంత్ – శుభ్‌మన్ గిల్‌ల మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌ ఒక దశలో భారీ స్కోరు దిశగా సాగింది. రెండో రోజు ఆటను 359/3 వద్ద కొనసాగించిన భారత్‌కి, గిల్‌ అద్భుతంగా 147 పరుగులు చేసి కెప్టెన్‌గా తన మొదటి టెస్ట్‌లోనే అదరగొట్టాడు.

మరోవైపు పంత్ తనదైన శైలిని ప్రదర్శించి ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నడిపించాడు. 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 134 పరుగులతో అదరగొట్టిన పంత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పంత్ – గిల్ క‌లిసి 209 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌కు మంచి ఆధిక్యాన్ని అందించారు.

కానీ, ఉదయం సెషన్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ కంబ్యాక్ ఇచ్చింది. షోయబ్ బషీర్ శుభ్‌మాన్ గిల్‌ను బౌల్డ్ చేయ‌గా.. జోష్ టాంగ్ రిషబ్ పంత్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియ‌న్ చేర్చాడు. ఆ త‌రువాత వ‌చ్చిన‌ కరుణ్ నాయర్ డకౌట్ కావడంతో భారతదేశం కొంత ఒత్తిడిలో పడింది. లంచ్ సమయానికి భారత్ 454/7 వద్ద నిలిచింది. లంచ్ విరామం తర్వాత మిగిలిన మూడు వికెట్లను కేవలం 17 పరుగులకే కోల్పోయిన‌ భారత్ 471 పరుగులకు ఆలౌట్ అయింది.

బ్యాటింగ్ పరిస్థితుల్లో భారత్ కు అద్భుతమైన ఆరంభం లభించినప్పటికీ, ఇంగ్లాండ్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. బెన్ స్టోక్స్ 4/66తో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జోష్ టోంగ్ 4/86 తో తన వంతు సహకారాన్ని అందించారు. షోయబ్ బషీర్, బ్రైడాన్ కార్స్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

ఈ మ్యాచ్‌కు వాతావరణం కూడా కీలకంగా మారుతోంది. మేఘావృత పరిస్థితులు స్వింగ్‌కు అనుకూలంగా మారటంతో బౌలర్లకు కొంత లాభం చేకూరింది. పిచ్‌పై ముందు జాగ్రత్తగా కవర్లు వేసారు కూడా. పిచ్ ఇంకా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా, భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ జట్టు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది.

మొత్తం 471 పరుగులతో భారత్ మంచి ఆధిక్యంలో ఉన్నప్పటికీ, చివరి సెషన్‌లో ఇంగ్లాండ్ పునరాగమనం మ్యాచ్‌ను ఇంట్రెస్టింగ్ గా మార్చింది. వర్షం మ్యాచ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Leave a Reply