IND vs ENG 4th Test | ఒత్తిడిలో భార‌త్.. ఇంగ్లాండ్ ఆధిపత్యం !

మాంచెస్ట‌ర్ : ఇంగ్లాండ్ మరో అద్భుతమైన సెషన్‌ను (Morning session) నమోదు చేసింది. నాల్గవ రోజు (Day 4) ఉదయం సెషన్‌లో ఇంగ్లాండ్ (England) పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ ఆధిక్యం (lead) సాధించిన ఆతిథ్య జట్టు, రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించగానే భారత (India) టాప్ ఆర్డర్‌ను తుడిచిపెట్టేసింది. మొదటి మూడు ఓవర్లలో ఇద్దరు కీలక బ్యాట‌ర్ల‌ను అవుట్ చేసి భారత్‌ను 1/2కే పరిమితం చేశారు. ఇప్పుడు, ఈ టెస్ట్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా నిలబెట్టుకోవాలంటే భారత్ ఒక అద్భుతం చేయాలి.

రోజు ఆరంభంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ – లియామ్ డాసన్ తమ ఇన్నింగ్స్ కొనసాగించారు. ఆకాశం మేఘావృతంగా ఉండటంతో భారత బౌలర్లు మంచి ఆరంభం అందుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా డాసన్‌ను 26 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బ్రైడన్ కార్స్ స్టోక్స్‌కు జత కలిశాడు. స్టోక్స్ ఆత్మవిశ్వాసంతో ఆడుతూ అద్భుత శతకం నమోదు చేశాడు.

స్టోక్స్ – కార్స్ కలిసి స్కోరు 600 దాటించేలా ఆడారు. ఇద్దరూ దూకుడుగా బౌండరీలతో విరుచుకుపడ్డారు. స్టోక్స్ 141 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి ఔటవ్వ‌గా.. 10వ వికెట్ కు 95 పరుగుల భాగస్వామ్యం నెల‌కొల్పారు. కార్స్ కూడా అదిరే షాట్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌటైంది. మాంచెస్టర్ టెస్ట్ చరిత్రలో అత్యధిక స్కోరు.

311 పరుగుల వెనుకబాటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్, లంచ్‌కు ముందు 15 నిమిషాల సవాలుతో నిలబడాల్సి వచ్చింది. అయితే ఆ చిన్న సమయమే ఆపదగా మారింది. క్రిస్ వోక్స్ తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (0), బి సాయి సుధర్షన్ (0)లను పెవిలియన్‌కి పంపించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ లంచ్‌కు సమయం వరకూ క్రీజులో నిలబడ్డారు. భారత్ 1/2 వద్ద లంచ్ బ్రేక్‌కి వెళ్లింది. ఇప్పటికే భారీ ఒత్తిడిలో ఉన్న భారత్‌కు, ఇకపై మ్యాచ్‌ను కాపాడాలంటే అద్భుతం అవసరం.

Leave a Reply