- 6.30 లక్షల క్యూసెక్కుల వరద
- 40 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరు విడుదల
- అర్ధరాత్రికి ఎనిమిది లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం
- పది లక్షలు దాటితో గోదావరి నదికి వరద ప్రమాదం
గోదావరిఖని , ఆంధ్రప్రభ : శ్రీపాద సాగర్ (ఎల్లంపల్లి ప్రాజెక్టు)కు వరద పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి వరద 6.30 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. మధ్యాహ్నం 5.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ప్రస్తుతం మరో లక్ష క్యూసెక్కులు వరద చేరుతోంది. అధికారులు అప్రమత్తమై ఎంత మేర ఇన్‌ఫ్లో ఉందో అదే స్థాయిలో నీరు విడుదల చేస్తున్నారు. అర్ధరాత్రికి ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని శ్రీపాద ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవీందర్ చారి తెలిపారు.
సుమారు పది లక్షల క్యూ సెక్కులు నీరు ఇన్‌ఫ్లో పెరిగితే గోదావరికి వరద ప్రమాదం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వరద పరిస్థితి గమనించిన అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన 40 గేట్లను 3 నుండి 4 మీటర్ల ఎత్తుకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టుకు సంబంధించిన వరద గేట్లు తెరవడంతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగిపోతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148.00 కాగా, ప్రస్తుత నీటి మట్టం 147.35 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.9679 టీఎంసీలకు చేరుకుంది.
పార్వతి బ్యారేజీ…
అలాగే సుందిళ్ల పార్వతి బ్యారేజ్ కి సంబంధించి 74 గేట్లను ఎత్తి 5 లక్షల 98 వేల 345 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 130 మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టం కాగా, ప్రస్తుతం 124.01 మీటర్ల నీటి మట్టం ఉంది. ఎంత మేర ఇన్‌ఫ్లో ఉందో అదే స్థాయిలో కిందకు విడుదల చేస్తున్నారు. గోదావరి నదిలో చేపలు పట్టేవారు, గొర్రెలు, పశువుల కాపరులు నదిలోకి వెళ్లరాదని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి .రవీందర్ చారి హెచ్చరిస్తున్నారు.