ప్రీమియర్​ ఎన్జరీస్ ​ రెడీ

నెల్లూరులో టాప్​ కాన్​ సెల్​ కంపెనీ

రూ.1700 కోట్ల పెట్టుబడి .. విస్తరణకు మరో రూ.5‌‌02 కోట్లు

ఇక ఉపాధి .అభివృద్ధి పరుగో పరుగు

( ఆంధ్రప్రభ, బిజినెస్​ ప్రతినిధి)  

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకున్న తమ భారీ సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏకంగా ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తూ రూ. 1,700 కోట్ల భారీ పెట్టుబడికి ప్రీమియర్ ఎనర్జీస్  సిద్ధమైంది. ఈ పెట్టుబడితో నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో 4 GW సామర్థ్యంతో  సోలార్ పీవీ TOPCon సెల్ తయారీ యూనిట్‌ను,   అనుబంధంగా 5 GW సిలికాన్ ఇంగట్, వేఫర్ తయారీ ప్లాంట్‌ను కూడా నెలకొల్పనుంది.

ఏపీ చొరవతోనే..

ఈ ప్రాజెక్టు తరలింపు వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన చొరవ, వేగం అద్భుతం. కంపెనీకి అవసరమైన 269 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) అతి తక్కువ సమయంలో కేటాయించింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్స్ అని మాటలకు పరిమితం కాకుండా అక్టోబర్ 2024లో చర్చలు మొదలెట్టి, ఫిబ్రవరి 2025 కల్లా భూమి కేటాయింపు జరిపి , ఆ పనితనాన్ని చేతల్లో చూపించింది. సముద్ర పోర్టులకు దగ్గరగా ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలు ప్రీమియర్ ఎనర్జీస్ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి.

ఉపాధి.. అభివృద్ధి ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా సుమారు 2,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పరిశ్రమ విస్తరణతో మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.ఈ భారీ పెట్టుబడి ద్వారా ఆంధ్రప్రదేశ్ సోలార్ తయారీ రంగంలో ముఖ్య కేంద్రంగా మారుతుంది. ఇది రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుంది.  తొలి పెట్టుబడి రూ. 1,700 కోట్లతో పాటు, భవిష్యత్తులో ఈ సెల్ తయారీ సామర్థ్యాన్ని 7 GWకు పెంచడానికి మరో రూ. 502 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది.  భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్. తయారీ ప్రక్రియలో సమన్వయం (Backward Integration) కోసం సిలికాన్ ఇంగట్/వేఫర్ తయారీని, సెల్ తయారీని ఒకే చోట నెలకొల్పడం ఈ  కంపెనీ వ్యూహం.  ఏపీలోని సౌర శక్తికి అనుకూల వాతావరణం, ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు ఈ పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు రాకతో ఆంధ్రప్రదేశ్ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో లక్ష్యంగా పెట్టుకున్న పెట్టుబడులు, ఉద్యోగాల సాధన దిశగా మరో ముందడుగు వేసినట్లయింది.

Leave a Reply