సత్యమే నిత్యం, సత్యమే శాశ్వతం. సత్యం బ్రూయత్ ప్రియం బ్రూయత్, న్రబూయత్ సత్యమప్రియం, ప్రియంచ నానృతం బ్రూయత్ పష ధర్మ సనాతన: అని మనుశాస్త్రంలో చెప్పబడింది. సత్యం అంటే నిజం. నిజం ఎల్లప్పుడూ నిప్పు లాంటివే. ఎందరో చక్రవర్తులూ, రాజులూ, మహారాజులూ, పాలకులూ సత్యమునే నమ్ముకుని దివ్యత్వాన్ని పొందారు. పూర్వకాలంలో సత్యవ్రతుడనే రాజు వుండేవాడు. ఆయన సత్యంను జీవిత ధర్మంగా లక్ష్యంగా భావించి, ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
ఒక రోజున బ్రహ్మీ ముహుర్తంలో నదిలో స్నానానికై బయలుదేరాడు. సింహద్వారం వద్దకు రాగానే ఒక తేజోవంతమైన ఒక స్త్రీ బయటకు రావడం చూసి, రాజు అమ్మా మీరు ఎవరు? రాజభవనం నుండి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగాడు. అందుకు ఆమె, మహారాజా, నేను ధనలక్ష్మిని. నీ భవనంలో చాలాకాలంగా వున్నాను. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, నాకు అనుమతినివ్వండి అంది. మంచిది, వెళ్ళిరండి అని అన్నాడు మహారాజు. తర్వాత ఒక సుందర పురుషుడు బయటకు వెళ్తుంటే చూసి ఆపాడు. మీరెవరు, నా భవనం నుండి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడగ్గా, ఆయన, మహారాజా నేను దానమును. ధనము లేని చోట నేను ఎలా వుండగలను, కావున నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అనగానే మహారాజు సరేనన్నాడు. మరికొంత సేపటికి ధనము, దానము లేని చోట మేమెలా ఉండగలము మాకు కూడా అనుమతినివ్వండి అనగా రాజు అనుమతినిచ్చాడు. యశస్సు, సదాచారము వెళ్ళిపోయాయి. ఇక తర్వాత గంభీరంగా ఒక దివ్య పురుషుడు కనిపించాడు. మహారాజా ధనము, దానమూ, సదాచారము, యశస్సు లేనప్పుడు నేనెందుకు, నా పేరు సత్యము. నాకు అనుమతినివ్వండి, వెళ్ళొస్తాను అన్నాడు. సత్యం అన్నమాట వినగానే మహారాజు ఆ దివ్య పురుషుని పాదాలపై పడి, మీరు వెళ్ళడానికి నేను అనుమతించను, నాకు ధనము, దానము, సదాచారమూ, యశస్సు ఏదీ లేకపోయినా పరవాలేదు. కానీ మీరులేనిదే నేను జీవించలేను, మిమ్మల్ని మాత్రం వదలను అంటూ ఆయన పాదాలను వదలలేదు. అప్పుడా పుణ్యపురుషుడు, మహారాజా, నీ సత్యప్రీతికి నాకు చాలా సంతోషంగా వుంది. సరే నేను వెళ్ళను అని అనగానే, ధనము, దానము, సదాచారము, యశస్సు అన్నీ సత్యం లేకపోతే మేము ఎలా అంటూ భవనంలోకి ప్రవేశించాయి. సత్యముతోటే లక్ష్మి వుండాలి. సత్యములోనే దానానికి సార్థకత. సత్యమును దూరం చేసుకుంటే నాది దురాచారమవుతుంది. అందువల్ల ఎల్లవేళలా సత్యమునే పలకాలి. ప్రియంగానే మాట్లాడాలి. సత్యం అయినాసరే ఎంతో ప్రియంగా పలకాలి. సత్యం అయినా అది అప్రియమైతే పలుకరాదు. సత్యం ఎంతో విలువైనది జీవితం సార్థకం కావడానికి.
-డా|| పులివర్తి కృష్ణమూర్తి