TG | కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే వారిని ఆ జాబితా నుంచి తొలగించాలి : బండి సంజయ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే నివేదిక పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా ఈ నివేదికలో బీసీలకు అన్యాయం చేసే విధంగా.. బీసీ జనభాను తగ్గించారని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కులగణన నివేదికపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.
ఆయన ట్వీట్‌లో “మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ఈ విషయం తెలిసినప్పటికీ, కాంగ్రెస్ ఇప్పటికీ కేంద్రంపైకి నెట్టడానికి ప్రయత్నించడం పూర్తిగా మూర్ఖత్వం. బీసీ రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు. ముస్లింలను బీసీ కేటగిరీలో చేర్చడం వల్ల బీసీలకు సరైన రిజర్వేషన్లు లేకుండా పోతాయి. ముస్లింలను బీసీల్లో చేర్చితే హిందూ సమాజం మొత్తం తిరుగుబాటు చేస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరిణామాలు తప్పవు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించాలి. 420 హామీల ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెనక్కి నెట్టి బీసీలను పూర్తిగా మోసం చేస్తుంది. కాంగ్రెస్ ద్రోహాన్ని బీసీలందరూ గుర్తించాలని కోరుతున్నాను.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. మార్చిలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ కు తెలియదా? 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ లు నిలిచిపోతాయని తెలిసినా ఎన్నికలను వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు నిధులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 73వ, 74వ రాజ్యాంగ సవరణలను ఉల్లంఘిస్తుంది. ప్రతి ఐదేళ్లకోసారి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం ఆదేశించింది. సర్పంచ్‌లు లేకుంటే గ్రామ సభలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా అమలు చేస్తారు? గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఓటమి భయంతోనే కాంగ్రెస్ స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు” అని బండి సంజయ్ రాసుకొచ్చారు.