పేదలను అడ్డం పెట్టుకుని పెద్దలే ఆక్రమిస్తున్నారు
హైడ్రా తొలి వార్షికోత్సవంలో రంగనాథ్
ఏడాదిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం .
రూ.30 వేల విలువైన భూములను ఏడాదిలో కాపాడాం
హైదరాబాద్: ఆక్రమణదారులకు చిక్కకుండా ప్రజలే తమ ఆస్తులను పరిరక్షించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు. హైడ్రా తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ అంబర్ పేటలోని బతుకమ్మకుంట వద్ద విద్యార్థులు, స్థానికులతో కలిసి నేడు పెద్దఎత్తున మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, కాంగ్రెస్ నేత వి. హనుమంతరావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వారందరితో నీటి వనరుల పరిరక్షణపై రంగనాథ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో బతుకమ్మ సంబురాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడి నుంచే ప్రారంభిస్తారని తెలిపిన రంగనాథ్.. అందుకు అనుగుణంగా బతుకమ్మకుంటను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.
ఏడాదిలో ఎన్నో సవాళ్లు..
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఏడాదిలో హైడ్రాకు ఎన్నో మంచి, చెడు అనుభవాలు ఎదురయ్యాయి. విపత్తుల నిర్వహణకు సంబంధించి పక్కా ప్రణాళికతో హైడ్రా పనిచేస్తుంది. ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాం. హైడ్రా పరిరక్షించిన స్థలాల విలువ దాదాపు రూ.30 వేల కోట్లపైనే ఉంటుంది. ఆరు చెరువులను పునరుద్ధరిస్తున్నాం, వాటి విస్తీర్ణం రెట్టింపు స్థాయిలో పెరిగింది. రహదారులపై, మూసీలో వృథాగా పోయే నీటిని చెరువుల్లోకి మళ్లిస్తున్నాం. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షిస్తున్నాం. న్యాయపరమైన సవాళ్లను కూడా అధిగమిస్తూ భూములను కాపాడుతున్నాం. కూల్చడమే కాదు నిర్మాణం చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తుంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.
ఆక్రమణలను నివారించడంతో పాటు.. హైడ్రా రాకముందు నిర్మించుకున్న ఇళ్లకు మినహాయింపు ఇచ్చాం. ప్రభుత్వం హైడ్రాకు ఒక నిర్దిష్టమైన విధానాన్ని సూచించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే హైడ్రా పనిచేస్తుంది. ఆక్రమణల వెనుక చాలా మంది పెద్దవాళ్లు ఉంటారు. వాళ్లు తప్పించుకోవడానికి పేదలను బుల్డోజర్ల ముందు పెడుతున్నారు. పేదవాళ్ల మీద హైడ్రా పగబట్టిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తున్నారు. రూ. 30-40 కోట్ల పార్క్ స్థలాన్ని ఆక్రమించే ధైర్యం పేదవాళ్లకు ఉంటుందా. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీకి సంబంధం లేకున్నా హైడ్రాకు ముడిపెట్టారని చెప్పారు రంగనాథ్
ఒవైసీ కళాశాలపై…
ఒవైసీ కళాశాల విషయంలో మా నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాం. హైడ్రా ఒక సామాజిక కోణంలో పనిచేస్తుంది. ఒవైసీ కళాశాల 2015-16లో నిర్మించారు. కళాశాల ఉన్న చెరువు ప్రాంతానికి 2016లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. సల్కం చెరువుకు తుది నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. నగరంలోని 80 శాతం చెరువులకు తుది నోటిఫికేషన్ ఇంకా జారీ చేయలేదు. 140 చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్ ఇచ్చారు. 540 చెరువులకు పదేళ్ల కిందట ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. సల్కం చెరువు నోటిఫికేషన్ ప్రాసెస్లో ఉండగా ఎవరికి వారు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అనధికారిక నిర్మాణాలను తప్పకుండా తొలగిస్తాం.
ఒవైసీ కళాశాలపైనే పదే పదే ఎందుకు ప్రశ్నిస్తున్నారు. ఆ కళాశాలపై ఎందుకు అంత ఆసక్తి? ఏ వర్గం కళాశాల అయినా ఒకటే రూల్ వర్తిస్తుంది. సామాజిక కోణంలో కూడా ఆలోచించాలి. హైడ్రా ఏడాది కిందట వచ్చిన సంస్థ.. అంతకుముందు కట్టిన వాటికి కూడా ఒకటే రూల్ ఉండాలనేది సరైన పద్ధతి కాదు” అని కమిషనర్ రంగనాథ్ అన్నారు.

