హైదరాబాద్ – శ్రీశైలం రోడ్డు కు బ్రేక్

హైదరాబాద్ – శ్రీశైలం రోడ్డు కు బ్రేక్

కొండారెడ్డిపల్లి మీదుగా రాకపోకలు


……..
ఉప్పునుంతల, ఆంధ్రప్రభ : తుఫాన్ ప్రభావంతో దుండుభి, చంద్రవాగు వంటివాగులు ఉధృతంగా ప్రవహించడంతో హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారి దెబ్బతింది. రహదారి ఒకభాగం వరద ఉధృతికి తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారుల భద్రత దృష్ట్యా పోలీసులు, రవాణా శాఖ అధికారులు కొండారెడ్డిపల్లి మార్గం ద్వారా వాహనాలను మళ్లించారు. శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు కొండారెడ్డిపల్లి చింతపల్లి బ్రిడ్జి తిప్పాపూర్ హాజీపూర్ మీదుగా వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. హైదరాబాదు నుండి అచ్చంపేటకు చేరుకునే ప్రయాణికులు కొండారెడ్డిపల్లి చింతపల్లి కాంసానిపల్లి ఉప్పునుంతల మీదుగా రాకపోకలను పునరుద్ధరించారు.

ముందు జాగ్రత్తలతో…


అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన తెలిపారు. అవసరమైతే మరిన్ని రహదారి మరమ్మత్తు పనులు తక్షణమే చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

జిల్లా ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్, అచ్చంపేట డిఎస్పీ పల్లె శ్రీనివాస్ కూడా బ్రిడ్జి వద్ద పర్యవేక్షణ నిర్వహించారు. పోలీసులు రాత్రింబవళ్లు అక్కడే మానిటరింగ్ చేస్తూ వాహనదారులు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా హెచ్చరికలు చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

గ్రామాల మధ్య రవాణా సౌకర్యం పునరుద్ధరించేందుకు సంబంధిత విభాగాలు కృషి చేస్తున్నాయి.

Leave a Reply