HYD | ఐటీ కారిడార్ లో రయ్ రయ్.. మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ పూర్తి !

హైదరాబాద్ మహానగరంలోని ఐటీ కారిడార్ లో వాహనాలు దూసుకెళ్లనున్నాయి. న‌గ‌ర‌ ట్రాఫిక్ సమస్యలకు వేశేష ఊర‌ట‌ కలిగించే మరో మైలురాయిగా.. కొండాపూర్ శిల్పా లేఅవుట్ (ఫేజ్-2) ప్రాంతంలో నిర్మించిన మల్టీలెవెల్ ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉంది. మల్టీ లెవల్ ఫ్లైఓవర్ పూర్తి కావడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఫ్లైఓవర్‌ను వచ్చే నెల (జూన్) మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

దాదాపు రూ.178 కోట్లు వ్యయంతో నిర్మించిన‌ 1.2 కిలోమీటర్ల పొడవు గల ఈ ఫ్లైఓవ‌ర్, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (SRDP) కింద నిర్మితమైంది. ఇది గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది.

మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ వివరాలు:

లెవ‌ల్ 1: గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవ‌ర్ (ఇప్పటికే వినియోగంలో ఉంది)

లెవ‌ల్ 2: శిల్పా లేఅవుట్ ఫేస్-1 ఫ్లైఓవ‌ర్ (ప్రస్తుతం అందుబాటులో ఉంది)

లెవల్ 3: కొత్తగా నిర్మించిన శిల్పా లేఅవుట్ ఫేస్-2 ఫ్లైఓవ‌ర్ (ఇప్పుడే పూర్తయ్యింది), ఇప్ప‌టిక ఉన్న రెండు ఫ్లైఓవ‌ర్ల‌ పైన నిర్మితమైంది.

ఈ ఫ్లైఓవ‌ర్ తో కలిపి SRDP కింద మొత్తం 42 ప్రాజెక్టులలో 37 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కాగా, శిల్పా లేఅవుట్ ఫేస్-2 ఫ్లైఓవ‌ర్ తో నగరంలో ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్లలో ఒకటైన గచ్చిబౌలి వద్ద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించడమే కాకుండా, టెక్ కారిడార్‌లో ప్రయాణ వేగం పెరుగుతుంది.

తదుపరి లక్ష్యం – రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు:

SRDP కింద చేపడుతున్న 42 ప్రాజెక్టులలో, మరో రెండు కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ROBలు) ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఫలక్‌నుమా ROB – జూలై చివరి నాటికి పూర్తవుతుంది, ఆగస్టు చివరి నాటికి శాస్త్రిపురం ROB ని పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు.

ఈ ROBలు పూర్తయితే, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాల్లో రోడ్డు-రైలు మార్గాల అనుసంధానం మరింత మెరుగవుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు హైదరాబాద్ నగరాన్ని సిద్ధం చేస్తున్నాయి.

Leave a Reply