- ఆసుపత్రిపాలైన మరో ఏడుగురు
- ఇద్దరి పిస్థితి విషమం
హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ (Food poisoning) కారణంగా ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ మృతి చెందారు. అదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బోనాల పండగ సందర్భంగా వండిన మటన్, బోటి, చికెన్ ఫ్రిజ్లో ఉంచి ఆ తరువాత తినడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన వారిని రజిత (38), జస్విత (15), గౌరమ్మ (65), లహరి (17), సంతోష్ కుమార్ (39), రాధిక (38), బేబీ కృతాంగ (7)లుగా గుర్తించారు.
ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన వారిని చింతలకుంటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ జాగ్రత్తలపై అధికారులు ప్రజలకు మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.