వేటాడుతూ.. హింసిస్తూ..

వేటాడుతూ.. హింసిస్తూ..
- జంతువులపై పాశవిక చర్య
- ఆపై ఇన్ స్టాలో పోస్టులు..
- వేటగాడి ఆట కట్టించిన అటవీ శాఖ
- నిందితుడి ఇంటిపై మెరుపు దాడి
- పరికరాలు, జంతువుల అవశేషాలు లభ్యం
- కరీంనగర్ రేకుర్తిలో ఘటన
- కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ: చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ.. అడవి జంతువులను వేటాడుతూ.. ఆపై క్రూరంగా వాటిని హింసిస్తున్న ఓ వేటగాడు ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు చిక్కాడు.. వేటాడిన జంతువులను హింసిస్తూ.. ఎలాంటి బెరుకు లేకుండా ఇన్ స్టా గ్రామ్ లో సైతం పోస్టులు పెట్టి రాక్షసానందం పొందుతున్న వేటగాడు చివరకు కటకటాల పాలయ్యాడు. నిందితుడి ఇంటి పై మెరుపు దాడి చేసిన అటవీ శాఖ అధికారులకు వేటకు ఉపయోగించే పరికరాలు, జంతువుల అవశేషాలు లభ్యమయ్యాయి. కరీంనగర్ రేకుర్తిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
నేరం అంగీకరించిన నిందితుడు..
గత కొంతకాలంగా కరీంనగర్ రేకుర్తి గ్రామానికి చెందిన దానవేణి నరసింహులు అనే వేటగాడు చాలా కాలం నుండి వేటాడిన జంతువులను క్రూరంగా హింసిస్తున్నట్లు తెలుస్తోంది. వేటాడిన జంతువులను చంపి ఆహారంగా వినియోగించడంతో పాటు గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించినట్లు ఫారెస్ట్ అధికారులు ముందు ఒప్పుకున్నట్లు సమాచారం.
ఇన్ స్టా పోస్టులతో వెలుగులోకి..
అయితే వేటాడేందుకు ఉపయోగించే వస్తువులను వేటాడిన తర్వాత దాన్ని హింసించే తీరు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసినట్లు లక్షెట్టి పేట అటవీ శాఖ రేంజర్ అనిత వాటిని గమనించారు. ఈ క్రమంలో కరీంనగర్ అటవీ శాఖ సిబ్బందితో కలిసి కరీంనగర్ కొత్తపల్లి ఎస్ హెచ్ఓ ట్రైనీ ఐపీఎస్ సోహం సహాయంతో ఇంటిపై సోదాలు నిర్వహించాడు. ఈ దాడిలో జంతువులను వేటాడే వస్తువులతోపాటు జంతువుల అవశేషాలు సీజ్ చేసినట్లు సమాచారం.
సంచలనం రేపిన ఘటన..
కరీంనగర్ జిల్లాలో భారీ స్థాయిలో ఫారెస్ట్ అధికారులు జంతువులతో చెలగాటమాడే వారిపై చర్యలు తీసుకోవడం, వారి పై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం సంచలనంగా మారింది. అయితే.. మహిళా అటవీ శాఖ అధికారిని టాస్క్ చేపట్టిన 24 గంటల్లోనే చేధించి నిందితుడిని కటకటాల వెనుకకు పంపించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఫారెస్ట్ అధికారి పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
