BITS Pilani | బిట్స్ పిలానీ భారీ విస్తరణ.. ఏపీ, తెలంగాణలోనూ పెట్టుబ‌డులు !

  • అమరావతిలో ‘AI+ క్యాంపస్‌’
  • హైదరాబాద్‌లో ‘ప్రాజెక్ట్ విస్తార్‌’

ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమ్మినెన్స్‌గా గుర్తింపు పొందిన బిట్స్ పిలానీ, రాబోయే ఐదు ఏళ్లలో సుమారు రూ.2,200 కోట్ల పెట్టుబడితో విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో ప్రత్యేక ‘AI+ క్యాంపస్‌’, తెలంగాణ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ విస్తార్‌ రూపుదిద్దుకుంటున్నాయి.

ఈ విషయాన్ని చాన్సలర్, ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా ఆదివారం ప్రకటించారు. ‘‘భారతదేశం $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచానికి జ్ఞాన కేంద్రంగా మారాలన్న లక్ష్యానికి అనుగుణంగా మూడు విస్తరణ ప్రాజెక్టులు చేపడుతున్నాం,’’ అని ఆయన వివరించారు.

‘‘ప్రాజెక్ట్ విస్తార్’’ – బిట్స్ చరిత్రలో అతి పెద్ద విస్తరణ

ప్రపంచానికి జ్ఞాన కేంద్రంగా మారాలన్న లక్ష్యంలోని మొదటి భాగంగా.. ‘ప్రాజెక్ట్ విస్తార్‌’ కింద బిట్స్ పిలానీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. ఈ దశలో రూ.1,200 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నారు. పిలానీ (రాజస్థాన్), హైదరాబాద్‌, గోవా క్యాంపస్‌లలో ఆధునిక భవనాలు, పరిశోధనా కేంద్రాలు, హాస్టెల్లు, అధ్యాపకుల నివాసాలూ నిర్మిస్తారు.

అండర్‌గ్రాడ్యుయేట్ లాబ్‌లు ప్రపంచ స్థాయికి తగినట్లు అప్‌గ్రేడ్ చేయడానికి రూ.60 కోట్లు కేటాయించారు. ఫలితంగా ఈ మూడు క్యాంపస్‌ల్లో విద్యార్థుల సామర్థ్యం 16,000 నుండి 21,000కి పెరుగుతుంది. మొత్తం బిట్స్ విద్యార్థులు 18,700 నుంచి 26,000కు చేరుతారని బిర్లా తెలిపారు.

అమరావతిలో అత్యాధునిక ‘AI+ క్యాంపస్‌’

రెండో భాగంగా అమరావతిలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో ‘AI+ క్యాంపస్‌’ నిర్మించనున్నారు. ఈ క్యాంపస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌, రోబోటిక్స్‌, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్‌, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్‌ పై ప్రత్యేక కోర్సులు, పరిశోధన ఉంటాయి.

స్మార్ట్‌, సస్టైనబుల్ మౌలిక సదుపాయాలతో రెండు దశల్లో ఈ క్యాంప‌స్ నిర్మాణం పూర్తవుతుంది. ఇక్కడ 7,000 మంది విద్యార్థులు చదివే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ యూనివర్సిటీలతో జాయింట్ పీహెచ్‌డీలు, ఇంటర్న్‌షిప్‌లు, హైబ్రిడ్ ట్విన్నింగ్ మోడళ్ల ద్వారా గ్లోబల్ ఎక్స్‌పోజర్‌ కల్పిస్తారు.

బిట్స్ పిలానీ డిజిటల్

మూడో భాగంగా ‘BITS Pilani Digital’ ను రూపొందించారు. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో 1 లక్షకు పైగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో 32 కొత్త ప్రోగ్రాములు (11 డిగ్రీలు, 21 సర్టిఫికెట్ కోర్సులు) ప్రారంభించ‌నున్నారు. ఈ బిట్స్ పిలానీ డిజిటల్ ద్వారా హైస్కూల్‌ నుండి వర్కింగ్ ప్రొఫెషనల్స్ వరకు అందరికీ అబ్ది చేకూర‌నుంద‌ని బిర్లా తెలిపారు.

నాణ్యమైన, సౌకర్యవంతమైన, ఆధునిక విద్య అందుబాటులో లేని వారికి బిట్స్ పిలానీ డిజిటల్ ఒక సోల్యూష‌న్ గా నిలుస్తుంద‌ర‌ని.. సాధారణ ఎడ్ టెక్ కాదని, బిట్స్ పిలానీ గర్వాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లే అవుట్ రీచ్ ప్లాట్‌ఫామ్ అని బిర్లా స్పష్టం చేశారు.

Leave a Reply