భయాందోళనలో భక్తులు…
నంద్యాల బ్యూరో, మార్చి 18 : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న శ్రీశైలం ముఖద్వారం వద్ద ఇవాళ ఉదయం భారీ ఎలుగుబంటి రోడ్డుపై హల్చల్ చేయడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురైన సంఘటన జరిగింది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డులో పట్టపగలు భారీ ఎలుగుబంటి రోడ్డుపై ఒక్కసారిగా కనపడడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.
ఎలుగుబంటి రోడ్డుపై నడుచుకుంటూ ప్రశాంతంగా అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. ఆ రోడ్డు పక్కన ఉన్న ప్రయాణికులపై ఎక్కడ దాడి చేస్తుందోనని భక్తుల ఆందోళన చెందారు. ప్రశాంతంగా అడవిలోకి ఎలుగుబంటి వెళ్ళిపోవడంతో అక్కడున్న ప్రయాణికులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో చిరుతపులులు, ఎలుగుబంట్లు ఇళ్లలోకి, రోడ్లపైన విచ్చలవిడిగా సంచరిస్తుండడంతో అక్కడున్న స్థానికులతో పాటు ప్రయాణికులు భక్తులు ఆందోళన చెందటం విశేషం.
అటవీశాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించడం వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు ప్రజలు. అటవీశాఖ అధికారులు అడవి ప్రాంతంలో వేసవికాలం కావడంతో నీటి కోసం సమీప గ్రామాల్లో ఉన్న ఇళ్లలోకి, రోడ్లపైకి ఈ జంతువులు రావటం విశేషం. అటవీ ప్రాంతంలో నీటి సౌకర్యం జంతువులకు కలుగజేస్తే ఈ బాధ తప్పుతుందని ప్రజలు వాపోతున్నారు.