వెల్దుర్తి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో గురువారం ఉదయం గ్యాస్ లీకేజీతో ఓ ఇల్లు ధ్వంసమైంది. రూ.25 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రామాంజనేయులు అనే వ్యక్తి ఇంట్లో ఉదయం 10 గంటల ప్రాంతంలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
ఇంటి వాకిళ్లు ఎగిరిపడగా, చెక్క తలుపులు దూరంగా పడ్డాయి. మంటల తీవ్రతతో ఇంట్లోని ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, దుస్తులు, పత్రాలు, నగదు అన్నీ బూడిదయ్యాయి. బాధితుడు రామాంజనేయులు తెలంగాణలో మామిడి పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఆయన తల్లి మద్దమ్మ, భార్య లక్ష్మీపార్వతి, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు కూలీ పనులకై, పిల్లలు స్కూలుకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. పేలుడు తీవ్రతతో బయట ఉన్న బైక్‌కు కూడా మంటలు అంటుకున్నాయి.
స్థానికులు నీటితో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న కోన అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలనార్చారు. ఇంట్లోని 10 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులు, రూ.97వేల నగదు, టీవీ, ఫ్రిజ్, దుస్తులు, పత్రాలు, పంట సామగ్రి అన్నీ మంటల్లో దగ్ధమయ్యాయి. పైకప్పు, ఇనుప గ్రిల్, మెట్లు బీటలు వారాయి.
సుమారు రూ.25 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబాన్ని గ్రామస్థులు ఆదుకున్నారు.

