దీపం అంటుకొని ఇల్లు దగ్ధం.. భారీ ఆస్తి నష్టం !!

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని పాత పోస్ట్‌ఆఫీస్ ప్రాంతంలో దీపారాధన కోసం వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.

మున్సిపల్ కేంద్రానికి చెందిన శ్రీరామోజు సత్యనారాయణచారి, పద్మ దంపతులు స్థానికంగా బుంగపట్ల యాకయ్య ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి దీపారాధన చేసిన అనంతరం, సత్యనారాయణచారి భార్య పద్మ పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు దీపం మంటలు సమీపంలో ఉన్న నిత్యవసర సరుకులు, బియ్యం, బీరువాకు అంటుకొని ఇంట్లో నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి.

దీన్ని గమనించిన చుట్టుపక్కల కాలనీవాసులు వెంటనే స్పందించి మోటార్ల సహాయంతో నీటిని చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే మంటలు ఇంటి అంతటా వ్యాపించడంతో నిత్యవసర సరుకులు, బియ్యం, బట్టలు, ఇంటి గోడలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఆ కుటుంబం నిరాశ్రయ స్థితిలోకి వెళ్లింది.

ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అధికారులు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు స్పందించి నిరాశ్రయులైన సత్యనారాయణచారి కుటుంబానికి నిత్యవసర సరుకులు, ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply