Hot Comments | కేంద్ర నిర్ల‌క్ష్య‌మే పహల్గామ్‌లో ఉగ్ర‌దాడికి కార‌ణం – సీపీఐ నారాయ‌ణ‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ :
జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ప‌ర్యాట‌కుల‌పై ఉగ్ర‌దాడికి కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యమే కార‌ణ‌మ‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ అన్నారు. మంగళవారం ప‌హ‌ల్గామ్ లో సయ్యద్ అజీజ్ పాషా తో క‌ల‌సి నారాయ‌ణ పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఇక్కడ ప్రతి రెండు వందల గజాలకు ఒక ఆర్మీ క్యాంపు ఉందని చెప్పారు. ఇలాంటి చోట ఉగ్ర‌వాదులు విచ్చల విడిగా కాల్పులకు తెగ బడ్డారు అంటే కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మ‌ని అన్నారు.

ఆప‌రేష‌న్ సిందూర్‌పై ఎన్నో అనుమానాలు

ఆపరేషన్ సిందూర్ పై ఎన్నో అనుమానాలు ఉన్నాయని నారాయ‌ణ అన్నారు. ఈ అనుమానాలు నివృత్తి కావాల్సి ఉందన్నారు. ఈ మేరకు పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్‌లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఏమి జరిగిందనేది తెలియాలని వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత పార్లమెంట్‌లో చర్చ జరగకుండానే.. ఎంపీల బృందాన్ని ప్రపంచం అంత పంపించారని అన్నారు. ఇదేమన్న విహారయాత్ర అని ప్రశ్నించారు. తాము ఏడు యుద్ధ విమానాలను కూల్చివేశామ‌ని పాకిస్తాన్ చెప్పుకుంటుందని, సర్జికల్ స్ట్రైక్ వాళ్లు చేయలేదని చెబుతోందని తెలిపారు. మన వైపు నుంచి మాత్రం విజయం సాధించామని చెబుతున్నారని పేర్కొన్నారు. వీటిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని, అప్పుడు ప్రజ‌లకు ఒక విశ్వాసం వస్తోందన్నారు.

Leave a Reply