Hostel | గురుకుల హాస్టల్‌లో విద్యార్థులకు నాసిరకం ఆహారం

Hostel | గురుకుల హాస్టల్‌లో విద్యార్థులకు నాసిరకం ఆహారం
Hostel | మునుగోడు, ఆంధ్రప్రభ : మండలంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల గురుకుల హాస్టల్‌లో విద్యార్థులకు తినరాని, నాసిరకం ఆహారం అందిస్తున్నారని అఖిల భారత విద్యార్థి సమాఖ్య మండల అధ్యక్షుడు గోపగొని ఉదయ్ తీవ్రంగా మండిపడ్డారు.ఆదివారం ఈ విషయమై ప్రశ్నించేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ మాడిపోయిన అన్నం, పప్పును విద్యార్థులకు వడ్డించడం అధికారుల ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని పూర్తిగా పక్కనపెట్టి ఇలాంటి ఆహారం పెట్టడం వల్ల ఎప్పుడైనా సామూహిక అనారోగ్యం తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.హాస్టల్ వెనుక భాగంలో ప్రహరీ గోడ సరిగా లేకపోవడంతో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.
చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశమున్నప్పటికీ సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల హాస్టల్ అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. తక్షణమే ఆహార నాణ్యతపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, ప్రహరీ గోడను వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు.ఈ వ్యవహారానికి బాధ్యులైన పాఠశాల ఇన్చార్జిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
