వాషింగ్టన్ డి సి : అణు స్థావరాలపై (Nuclear Plants )_ అమెరికా దాడులకు ప్రతీకారంగా హార్ముజ్ (Hormuz) జలసంధిని మూసేస్తామని ఇరాన్ (Iran ) హెచ్చరించింది. అనుకున్నట్లుగానే ఇరాన్ పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప జేసుకుంది.. దీంతో హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముడి చమురు, సహజ వాయువు రవాణాకు కీలకంగా ఉన్న ఈ జలమార్గాన్ని మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురయిన అమెరికా చైనా సాయం కోరింది. ఇరాన్ మనసు మార్చాలని అభ్యర్థించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సెక్రెటరీ మార్కో రూబియో ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.
మధ్య ప్రాచ్య దేశాల వ్యవహారాల్లో చైనా కూడా కీలక భాగస్వామి అని మార్కో రూబియో పేర్కొన్నారు. ముడి చమురు రవాణా కోసం హార్మూజ్ జలసంధిపై ఇతర దేశాలు కూడా ఆధారపడ్డాయని అన్నారు. ఈ నేపథ్యంలో చైనా తక్షణం జోక్యం చేసుకోవాలని, ఇరాన్ మనసు మార్చాలని పేర్కొన్నారు.
హార్ముజ్ జలసంధిని మూసివేస్తే మరో భారీ తప్పిదం చేసినట్టే. వాళ్లకు అది ఆర్థికంగా ఆత్మహత్యతో సమానం’ అని మంత్రి రూబియో స్పష్టం చేశారు. ఈ పరిస్థితి తలెత్తితే ఏం చేయాలనే విషయంలో అమెరికాకు పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కూడా చెప్పారు. ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఈ చర్యల ఆర్థిక పర్యవసానాలు అమెరికాకంటే మిగతా దేశాలపైనే ఎక్కువగా ఉంటాయని అన్నారు.