High Power | 10,11 తేదీల్లో శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాలు

High Power | 10,11 తేదీల్లో శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాలు

  • ఉత్సవాలు ప్రారంభించనున్న జస్టిస్ దుర్గాప్రసాద్

High Power | ఘంటసాల, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీకాకుళంలో శ్రీకృష్ణ దేవరాయ మహోత్సవాలను ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం 4గంటలకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వ హైపవర్ కమిటీ చైర్మన్ జస్టిస్ యూవీ దుర్గాప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభిస్తారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని ఆంధ్ర మహా విష్ణువుగా ఖ్యాతి గాంచిన శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానంలో రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో వేటూరి సుందర రామమూర్తి రచించిన ‘సిరికాకొలను చిన్నది’ నృత్య నాటికను ప్రసిద్ధ నాట్య కళాకారిణి స్మితా మాధవ్ బృందం ప్రదర్శిస్తారని తెలిపారు.

ఈ వేడుకల్లో వేటూరి సుందర రామమూర్తి సతీమణి సీతామహాలక్ష్మమ్మను సత్కరించనున్నట్లు బుద్ధప్రసాద్ తెలిపారు. 1518 ఫిబ్రవరి 11వ తేదీన శ్రీకృష్ణ దేవరాయల వారు శ్రీకాకుళం వచ్చినట్లు శాసన ఆధారాల ప్రకారం 2007నుంచి శ్రీకృష్ణ దేవరాయ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ ఉత్సవాలను ముందుకు తీసుకు వెళ్ళలేదన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం ఈ ఉత్సవాలు ప్రారంభించినట్లు తెలిపారు.

ఆంధ్ర మహా విష్ణువు శ్రీకృష్ణ దేవరాయలుకు కలలో కనిపించి దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రకటించి తెలుగులో కావ్యం వ్రాయమని ఆదేశించటం, తత్ఫలితంగా ఆముక్త మాల్యద గ్రంధ రచనకు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకారం చుట్టిన మహత్యం సందర్భాన్ని గుర్తు చేస్తూ తెలుగు భాష పరిరక్షణకు ఈ ఉత్సవాలు దోహద పడతాయన్నారు.

Leave a Reply