High Court | గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా…

High Court | గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా…
- జూలూరుపాడు గ్రామం ఏజన్సీ పరిధిలోకి రాదని కోరిన పిటిషనర్ రామారావు.
- గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలుపుదల చేయాలని హైకోర్టు ఉత్తర్వులు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని జూలూరుపాడు, ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా.
- ఎన్నికలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.
High Court | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : జూలూరుపాడు గ్రామ పంచాయతీకి జరిగే ఎన్నికలను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో లేని జూలూరుపాడు గ్రామాన్ని గిరిజన గ్రామంగా గుర్తించొద్దని రామారావు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు.
ఇటీవల తెలంగాణ ఎన్నికల కమీషన్ జూలూరుపాడు గ్రామానికి మూడవ విడతలో ఎన్నికలను నిర్వహించేందుకు నోటిఫికేషన్(Notification) జారీ చేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జూలూరుపాడు గ్రామ పంచాయతీ ఎన్నికలను నిలుపుదల చేయటంతో ఎన్నికల ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
తాళ్లూరి రామారావు అనే వ్యక్తి 15 నవంబర్ 2025 న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్లో చీఫ్ సెక్రటరీ, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా కలెక్టర్, కం ఏజెంట్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ న్యూడిల్లీ, తహసీల్దార్ జూలూరుపాడు, పంచాయతీ కార్యదర్శి జూలూరుపాడును ప్రతివాదులుగా చేర్చాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని, జూలూరుపాడు గ్రామాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా( గిరిజన గ్రామం)పరిగణించవద్దని న్యాయం చేయాలని పిటిషనర్ హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 29921 ఆఫ్ 2025 దాఖలు చేశారు.
07 డిసెంబర్1950 నవంబర్ 26, 16 అక్టోబర్ 1949 తేదీన జారీ చేసిన 2, (16, 1359, ఫస్లీ) రాజ్యాంగ విరుద్ధమని, భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లోని పేరా 6లోని ఆర్టికల్ 244(i ) సబ్ పేరా (i), రాజ్యాంగంలోని ఆర్టికల్ 372 ను ఉల్లంఘించారని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళారు.
గ్రామం అప్పటి వరంగల్ జిల్లా మధిర తాలూకా అంతర్భాగంగా ఉందని, కాని పాల్వంచ తాలూకాలో జూలూరుపాడు గ్రామం అంతర్భాగంగా ఉన్నట్లు గుర్తించి షెడ్యూల్డ్ గ్రామంగా నోటిఫై చేశారని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళారు. 1949 సంవత్సరంలో రాజ్ ప్రముఖ్(Raj Pramukh) జారీ చేసిన జారీ చేసిన 2, పదహారవ డే 1359 ఫస్లీ నోటిఫికేషన్(Fasli Notification) నంబర్లో తెలపలేదన్నారు.
పాల్వంచ తాలూకాలో అంతర్భాగంగా లేని జూలూరుపాడు మండలంలోని, జూలూరుపాడు గ్రామాన్ని అధికారులు షెడ్యూల్డ్ గ్రామంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని విన్నవించారు. మూడవ విడతలో జూలూరుపాడు గ్రామ పంచాయతీకి జరిగే ఎన్నికలను నిలుపుదల చేసేలా అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. పిటిషనర్(Petitioner) అభ్యర్థనను మన్నించిన ఉన్నత న్యాయస్థానం నవంబర్ 28న ఎన్నికలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ఉత్తర్వుల మేరకు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లాలోని జూలూరుపాడు, ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని జూలూరుపాడు ఎంపీడీఓ పూరేటి అజయ్(MPDO Pooreti Ajay) తెలిపారు.
