Crime : ఇంట్లో భారీ చోరీ.. 40తులాల బంగారం అపహరణ
తాండూరు, ఆంధ్రప్రభ : తాళం వేసిన ఇంటికి గుర్తుతెలియని దుండగులు కన్నం వేశారు. ఇంటి తాళాలు పగులగొట్టి సుమారు 40తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ సంఘటన తాండూరు పట్టణం సాయిపూర్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… సాయిపూర్ కు చెందిన పట్లోళ్ల వెంకటేష్, సరళ దంపతులు ఈనెల 6న కుటుంబ సభ్యులతో కలిసి ధారూర్ మండలం నాగసానిపల్లిలో అక్క కుమారుడు పెళ్లి కోసం ఇంటికి తాళం వేసి వెళ్లారు. పెళ్లి కార్యక్రమాలు ముగించుకుని శనివారం ఉదయం 11 గంటలకు సాయిపూర్ లోని వారి వివాసానికి చేరుకున్నారు.
అప్పటికే ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో ఆందోళన గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడంతో అంతా పరిశీలించగా, ఇంట్లో ఉన్న సుమారు 40తులాల బంగారం, ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సిఐ సంతోష్ కుమార్, ఎస్సై రమేష్ లు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జరిగిన చోరీ గురించి వివరాలను ఆరా తీశారు. దీంతో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్ ను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు.