గత రెండు, మూడు రోజులుగా దంచేస్తున్న వర్షాలు… రాష్ట్ర ప్రజలకు కొత్త సవాళ్లకు విసురుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఒకవైపు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరోవైపు ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ పలు కీలక సూచనలు జారీ చేసింది.
ప్రధాన సూచనలు:
👉 వ్యక్తిగత పరిశుభ్రత:
ఇతరులతో కరచాలనం చేయవద్దు. సబ్బు లేదా శానిటైజర్‌తో తరచుగా చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోండి.
👉 దోమల నివారణ:
ఇంటి చుట్టూ నీరు నిల్వకాకుండా చూసుకోండి. తలుపులు, కిటికీలకు దోమతెరలు (మెష్) అమర్చండి. దోమల పెరుగుదలను నివారించడానికి సెప్టిక్ ట్యాంకులు, నీటి సంపులను శుభ్రంగా ఉంచండి.
👉 ఆహారం, తాగునీరు భద్రత:
ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగండి. భోజనానికి ముందు, తరువాత తప్పనిసరిగా చేతులు కడుక్కోండి. కలుషితమైన ఆహారం కారణంగా ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు బయట తినడం మానుకోండి.
👉 అవసర మందులు అందుబాటులో:
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మందుల నిల్వలు తగినంతగా ఉన్నాయని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వర్షాకాలంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు.
వర్షాలు కొనసాగుతున్నందున నివాసితులు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ హెచ్చరికలను గమనించి, ఈ ఆరోగ్య సూచనలను ఖచ్చితంగా పాటించి సురక్షితంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కోరుతోంది.