సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. సాధారణ సగటు వర్షపాతం 167.9 మి.మీ.గా ఉండగా, ఈసారి అది 109 శాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారత రాష్ట్రాల్లో విపరీత వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, బురద జారిపడటం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశముందని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
దిల్లీ, దక్షిణ హర్యానా, ఉత్తర రాజస్థాన్ రాష్ట్రాల్లో సాధారణ జీవనానికి అంతరాయం కలిగే అవకాశముందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర ఆన్‌లైన్ సమావేశంలో వెల్లడించారు.
ఆగస్టు వర్షపాతం రికార్డు స్థాయిలో..
ఆగస్టులో వాయవ్య భారతదేశంలో 265 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది 2001 తర్వాత అత్యధికం, అలాగే 1901 తర్వాత 13వ అత్యధికంగా నమోదైందని ఐఎండీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో 268.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 5 శాతం అధికం.
జూన్ నుండి ఆగస్టు వరకు మూడు నెలల్లో 743.1 మి.మీ. వర్షపాతం నమోదైందని, ఇది సాధారణం కంటే దాదాపు 6 శాతం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కొత్త సవాళ్లు
ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన ప్రాంతాలకు రాబోయే భారీ వర్షాలు మరింత ముప్పుగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రభుత్వాల కోసం పెద్ద సవాల్‌గా మారనుంది.

