Rain | హైదరాబాద్ లో కుంభవృష్టి..

హైదరాబాద్ : ఉదయం నుంచి ఎండతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలపై వరుణ దేవుడు కరుణించాడు.. నేటి సాయంత్రం ఒక్కసారిగా హైదరాబాద్ (Hyderabad) లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఫిల్మ్ నగర్ (Film Nagar), మణికొండ (Manikonda), బంజారాహిల్స్ (Banjara Hills), జూబ్లీహిల్స్(Jubilee Hills), పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీ కాపూల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీస్లు ముగించుకుని సాయంత్రం ఇళ్లకు వెళుతున్న ఉద్యోగులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి నానాయాతన పడ్డారు.
శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్ ప్రాంతాలలో కూడా వర్షం కురిసింది. కేబీఆర్ పార్క్, పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టడంతో ఫుల్ ట్రాఫిక్ జాం అయింది. వాయుగండం కారణంగా తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. గురు, శుక్ర, శనివారం.. ఈ మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది.
హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది. జనగాం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మోస్తారు వర్ష సూచన చేసింది.
