- రైళ్ల భద్రతకు రైల్వే శాఖ అత్యవసర చర్యలు
గుంటూరు : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు క్రమంగా విస్తరిస్తూ, వరద ముప్పును తెచ్చాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, రైల్వే ట్రాక్‌లపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యేకించి పిడుగురాళ్ల–బెల్లంకొండ రైల్వే మార్గంలోని వంతెన నంబర్–59 వద్ద వరద నీటి మట్టం ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది.
ఇదే పరిస్థితి గుంటూరు–తెనాలి మధ్య వంతెన నంబర్–14వద్ద, అలాగే వెజెండ్ల–మణిపురం మధ్య వంతెన నంబర్–14వద్ద కూడా కనిపించింది. నీరు ఉధృతంగా పెరగడం రైళ్ల సురక్షిత రాకపోకలకు ఆందోళన కలిగిస్తోంది.
అత్యవసర సూచనలు !
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ అత్యవసర సూచనలు జారీ చేసింది. సిబ్బందికి ఆ ప్రాంతాల్లో రైళ్లను గరిష్టంగా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడపాలని ఆదేశించింది. ఇది వరద ముప్పు తగ్గేవరకు కొనసాగుతుంది.
నిరంతర పర్యవేక్షణ..
రైల్వే అధికారులు పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షిస్తున్నారు. వరద నీరు తగ్గి, ట్రాక్‌ల స్థితి భద్రంగా ఉందని నిర్ధారణ అయిన తర్వాతే సాధారణ వేగంతో రైళ్లు నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సహనంతో ఉండి, అధికారిక ప్రకటనలను గమనించాలని సూచించారు.