Film audition | గుండెపోటుతో..

Film audition | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటన బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అనకాపల్లికి చెందిన వడపల్లి సంజయ్ (55) సినిమాల్లో నటించాలనే ఆశతో నగరానికి వచ్చాడు. విద్యానగర్‌లో బంధువుల ఇంట్లో ఉంటూ ఆడిషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీలో ఉన్న ఓ సినిమా కార్యాలయానికి సంజయ్ వెళ్లాడు. అయితే ఆడిషన్స్ పూర్తయ్యాయని నిర్వాహకులు చెప్పడంతో అతడు నిరాశకు గురయ్యాడు. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరినా, అవకాశం లేదని స్పష్టం చేయడంతో అక్కడి నుంచి కిందకు దిగాడు.
ఈ సమయంలో అస్వస్థతకు గురైన సంజయ్ కుర్చీలో కూర్చొని కొద్దిసేపటికే కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు కారణంగానే మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
