ప్ర‌జారోగ్యానికే ప్రాధాన్యం..

ప్ర‌జారోగ్యానికే ప్రాధాన్యం..

నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందాల్సిందే
రోగులకు అందించే సేవల్లో రాజీ ప్ర‌స‌క్తే లేదు
అయోధ్య నగర్ యూపీహెచ్‌సీలో కలెక్టర్ ల‌క్ష్మీశ ఆక‌స్మిక త‌నిఖీ

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషిచేయాల‌ని, ఆరోగ్య ఆంధ్ర నిర్మాణానికి నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. గురువారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ న‌గ‌రంలోని అయోధ్య‌న‌గ‌ర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్‌సీ)ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యత, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.

పరిసరాల పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న సేవలు, అవుట్‌పేషెంట్ (ఓపీ) రిజిస్టర్, ఔషధ నిల్వలు, ల్యాబ్ పరీక్షలు, టీకాల కార్యక్రమం తదితర విషయాలను పరిశీలించారు. రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉండాల్సిన అన్ని అవసరమైన మందులు సమృద్ధిగా ఉండాలని, అలాగే డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గర్భిణీలు, చిన్నారులకు ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.

వేసవి కాలం నేపథ్యంలో జ్వరాలు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ ద్వారా ఆసుప‌త్రిలో అందుతున్న వైద్య సేవ‌ల‌పై ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాలు తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.

Leave a Reply