చెన్నయ్ – ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అనారోగ్యానికి గురయ్యారు. ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనను హుటాహుటిన చెన్నై గ్రీమ్స్ రోడ్‌లో గల అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తోన్నారు.
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. రెహ్మాన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన బాగానే ఉన్నారని, త్వరలో డిశ్చార్జ్ అవుతారని డాక్టర్లు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అభిమానులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇంట్లో ట్రెడ్ మిల్‌పై వాకింగ్ చేస్తోన్న సమయంలో రెహ్మాన్ ఛాతీ నొప్పి ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఉదయం 7:30 గంటల సమయంలో గ్రీమ్స్ రోడ్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో అడ్మిట్ చేశారు.
ఆయనకు డాక్టర్లు ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ వంటి పరీక్షలను నిర్వహించారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.మొన్నటివరకు ఆయన లండన్‌లో ఉన్నారు. శనివారం ఉదయమే లండన్ నుండి చెన్నైకి తిరిగి వచ్చారు. చేతిలో పలు సినిమాలు ఉండటం వల్ల విశ్రాంతి తీసుకోలేదని, మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న థగ్ లైఫ్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనుల్లో గడిపారని చెబుతున్నారు.
ఈ క్రమంలో ఈ ఉదయం వాకింగ్ చేస్తోన్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. ప్రయాణ అలసట, విశ్రాంతి లేకపోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సంబంధిత ఇబ్బందులు తలెత్తి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తోన్నాయి.