WGL | వైద్యం అంద‌ని ద్రాక్షే !!

  • అరకొర వసతులతో ఆరోగ్య కేంద్రాలు
  • రోగులకు సక్రమంగా అందని మందులు

నర్సంపేట రూరల్ (ఆంధ్రప్రభ) : వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ గ్రామీణ ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా తయారైంది. ఆరోగ్య రంగం దయనీయ స్థితిలో ఉందని గ్రామీణ ప్రజలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్‌లోని ఆరు మండలాలకు చెందిన మొత్తం 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు పూర్తి స్థాయిలో లేకపోవడం, మందులు సరిపడా అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు ప్యారాసెటమాల్, బిల్లా వంటి ప్రాథమిక మాత్రల తప్ప ఇతర మందులు ఇవ్వడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నర్సంపేట మండలంలోని బానోజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న అనేక ఉపకేంద్రాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పలు చోట్ల స్థిర వైద్యులు లేకపోవడంతో ఒక్కో డాక్టర్‌కి అనేక కేంద్రాల పరిపాలన బాధ్యతలు అప్పగించబడుతున్నాయి.

గత ప్రభుత్వ సమయంలో ఆర్భాటంగా ప్రారంభించిన పల్లె దవాఖానల్లో కూడా మందుల కొరత తీవ్రంగా ఉందని స్థానికుల అభిప్రాయం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటు, తేళ్ల కాటు, కుక్క కాటు వంటి అత్యవసర పరిస్థుతులకు అవసరమైన ఇంజెక్షన్లు, యాంటీడోట్లు కూడా లేవని ప్రజలు చెబుతున్నారు.

వైద్యుల విధులపట్ల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సమస్యలపై మాట్లాడేందుకు పలువురు వైద్యులను సంప్రదించినప్పటికీ ఫోన్లు ఎత్తలేదని, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు, తేళ్ల కాటు ఘటనలు తరచూ జరుగుతుండగా, ఇటీవల గ్రామాల్లో కుక్కల మరింత పెరుగుదల వల్ల చిన్నపిల్లలు, పెద్దవాళ్లు కాటుకు గురవుతున్నా, స్థానిక కేంద్రాల్లో రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దీంతో రోగులు నర్సంపేట సివిల్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాల్సి వస్తోంది.

డివిజన్ వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు సక్రమంగా లేకపోవడం, నియామకాలు జరగకపోవడం వల్ల గ్రామీణ ప్రజలకు వైద్యం అందడం నిర్విఘ్నంగా మారింది. ఈ దయనీయ పరిస్థితులపై జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆక్షేపిస్తున్నారు.

Leave a Reply