అందరూ ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది. పవర్ స్టార్ అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలూ, ప్రేక్షకులూ ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” విడుదలైంది. ఈ సినిమా ప్రత్యేకతలు ఎన్నెన్నో…
బ్రో చిత్రం తర్వాత చాలా రోజులకు విడుదలైన పవన్ కళ్యాన్ చిత్రం కావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీ ఎం గా బాధ్యతలు నెరవేరుస్తూనే షూటింగ్ పూర్తి చేయడంతో ఈ సినిమా పట్ల అత్యంత భారీ అంచనాలేర్పడ్డాయి. ఇంకా ఇది పవన్ నటించిన మొట్టమొదటి పీరియాడిక్ మూవీ.

16వ శతాబ్ధంతో మొదలైన ఈ కథలో.. ఎన్నో దురాగతాలకు పాల్పడుతున్న మొఘల్ చక్రవర్తి పరిపాలన, అతని పరిపాలనలో జరిగిన బలవంతపు మతమార్పిడులు..ఒప్పుకోని వారిపై హిందువులపై రుద్దిన జిజియా పన్నులు, రాజ్యంలో ఆకలి కేకలు, చావులతో అస్తవ్యస్తమైన పరిపాలన ఇలా కొనసాగుతుంటుంది.
ఇంకోపక్క దేశసంపదను తెల్లదొరలు తమదేశానికి తరలిస్తుంటారు. కొంతమంది వాళ్ళకు సహకరిస్తూంటారు.
అయితే అలాంటివారందరికీ వీరమల్లు అంటే సిమ్హ స్వప్నం. అన్యాయంగా, అక్రమంగా సంపాదించినవారి సంపదని దోపిడీ చేసి పేదవాళ్ళకు పంచుతూంటాడు వీరమల్లు.
అదే క్రమంలో బందరు నుంచి హైదరాబాద్ నవాబ్ కుతుబ్ షాహీ దగ్గరకు తీసుకెళ్తున్న వజ్రాలపై వీరమల్లు దృష్టి పడుతుంది. తన పరివారంతో దండెత్తి, చార్మినార్ వరకూ వచ్చి ఆ వజ్రాలను చేజిక్కించుకుంటాడు. వీరమల్లు వీరత్వంపై అపార నమ్మకమున్న కుతుబ్ షాహీ ఢిల్లీలో ఔరంగజేబు సిం హాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే బాధ్యతని వీరమల్లుకి అప్పగిస్తాడు.
అసలు ట్విస్టేంటంటే, ఈ పనీ వీరమల్లు ఎందుకు ఒప్పుకున్నాడు? ఆ వజ్రాన్ని తేగలిగాడా? ఈ ప్రయత్నంలో ఏం జరిగింది? అనుకోకుండా పరిచయమైన పంచమి(నిధి అగర్వాల్) కీ, వీరమల్లుకీ ముందేమైనా సంబంధం ఉందా? ఆసక్తికరమైన కథను తనదైన శైలిలో తెరకెక్కించిన క్రిష్ దర్శకత్వ ప్రతిభ తెలుసుకోవాలంటే తెరమీద చూడాల్సిందే.
దాదాపు నాలుగైదేళ్ళు సెట్స్ మీద ఉన్న సినిమా ఇది. అయినా, ఔట్ డేట్ అయిపోతుందన్న భయం అక్కర్లేని సినిమా ఇది. ఎందుకంటే పూర్తి చారిత్రక నేపథ్యం ఈ చిత్రానికి కథా వస్తువు.
గురాలూ, రాజుల కోటలూ, వారి ఆహార్యాలూ, వస్త్రధారణలూ చూడడానికి బావున్నాయి. పైగా, సుల్తానులూ, మహమ్మదీయులూ, హిందువులూ, ఆంగ్లేయులూ ఇలా రకరకాల వ్యక్తుల గుంపులూ, జీవన శైలీ ఎక్కడా ప్రేక్షకులకు అయోమయానికి గురిచేయకుండా తెరకెక్కించడంలో దర్శకుడు క్రిష్ ప్రతిభకి హ్యాట్సాఫ్. వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ సాహస కృయాలు అభిమానులకు పూనకాలు తెప్పించాయి. స్వధ్రమం-సనాతన ధర్మం గురించి పదేపదే వినిపిస్తున్నందున ఈ సినిమాలో ఉన్న ఈ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ సీన్లు, క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ అభినయం, సంభాషణలు, పాటలు, నేపథ్య సంగీతం భేష్ అనిపించాయి. గ్రాఫిక్స్ కూడా అతిగా వాడి ఎబ్బెట్టుగా అనిపించకుండా, కథకి అవసరమైనంత వాడి కథలో గ్రాఫిక్స్ ఒదిగిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సనాతన ధర్మం సినిమాకి ఎలా ఆయువుపట్టు అనేది తెరమీద చూడాల్సిందే. కొన్నిచోట్ల మాత్రం నిడివి పెంచడం కోసం చేసిన ల్యాగ్ అనిపిస్తుంది.
మొదటి భాగంలో పాత్రలు, వారి నేపథ్యాలు పరిచయం చేసారు కనుక ఇక రానున్న రెండోభాగం పూర్తి యుద్ధం నేపథ్యంలో కొనసాగనుందని టాక్ వినిపిస్తోంది. అక్కడక్కడా కొంత సైరా, బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ తరహాలో అనిపిస్తాయి విజువల్స్. ఆంగ్లేయులు, రాజుల పాత్రలు ఇటీవలి కాలంలో బాగా ప్రేక్షకుల మనసుల్లో ముద్రవేసుకున్నవి కావడం, కథా నేపథ్యం కూడా దాదాపు అదే కాలానికి చెందినది కావడం వల్ల కొంత అనిపించి ఉండవచ్చు.

(గమనిక : సమీక్ష పూర్తిగా సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది.)

Leave a Reply