Gunasekhar | యుఫోరియా యూత్ కి కనెక్ట్ అయ్యేనా…?

Gunasekhar | యుఫోరియా యూత్ కి కనెక్ట్ అయ్యేనా…?
Gunasekhar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్, సీనియర్ డైరెక్టర్ గుణ శేఖర్ రూపొందించిన లేటెస్ట్ మూవీ యుఫోరియా. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నీలిమ గుణ, యుక్తా గుణ ఈ సినిమాను (Movie) నిర్మించారు. నూతన నటీనటులతో గుణ శేఖర్.. నేటి యూత్‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్, సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంతకీ.. ట్రైలర్ ఎలా ఉంది..? ఈ సీనియర్ డైరెక్టర్ కి సక్సెస్ అందించేనా..?

Gunasekhar | క్రైమ్ నేపథ్యంతో..
ఇటీవల ధురంధర్ చిత్రంతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న సారా అర్జున్ (sara Arjun) ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. సమాజంలో యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ సమస్యలు, క్రైమ్ నేపథ్యంతో చాలా రా అండ్ ఇంటెన్స్‌గా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా, డ్రగ్స్ మత్తులో యువత తమ జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేసుకుంటున్నారనే అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

Gunasekhar | ఆ సంఘర్షణ హైలైట్..
ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ కథ సివిల్ సర్వెంట్ కావాలని కలలు కనే ఒక సామాన్య యువతి (సారా అర్జున్) చుట్టూ తిరుగుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆమె జీవితం, ఒక్క రాత్రిలో తలకిందులవుతుంది. నేటి యువత మాదకద్రవ్యాల ఊబిలో చిక్కుకుని, విచక్షణ కోల్పోయి ఎలా నేరాలకు పాల్పడుతున్నారో దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి భూమిక పోషించిన పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగింది. నిందితుడైన యువకుడి తల్లిగా ఆమె నటించారు. సాధారణంగా కన్న కొడుకు తప్పు చేస్తే.. కప్పిపుచ్చే తల్లులను మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ భూమిక తన కొడుకు చేసిన నేరాన్ని భరించలేక, బాధితురాలికి న్యాయం చేయాలని స్వయంగా హైకోర్టును ఆశ్రయిస్తుంది. ఆమె చేసిన నేరం ఏంటి? అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. మాతృత్వానికి, నీతికి మధ్య జరిగే ఈ సంఘర్షణ సినిమాకే హైలైట్ కానుంది అని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

Gunasekhar | వైవిధ్యమైన కాన్సెప్ట్..
పోలీస్ కమిషనర్ జయదేవ్ నాయర్‌గా ప్రముఖ దర్శకుడు (Director) గౌతమ్ వాసుదేవ్ మేనన్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ కేసును ఛేదించే క్రమంలో ఆయన పోక్సో చట్టాన్ని ఎలా ప్రయోగించారు? ఆధారాలను ఎలా సేకరించారు? అనే అంశాలను గుణశేఖర్ ఎంతో సహజంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే.. అర్థమవుతోంది. నీలిమా గుణశేఖర్ నిర్మాణంలో, కాల భైరవ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం టెక్నికల్‌గా చాలా ఉన్నతంగా ఉంది. కేవలం డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలనే కాకుండా, బాధ్యతాయుతమైన పేరెంటింగ్ ఎంత ముఖ్యమో ఈ సినిమా చెప్పబోతోంది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న యుఫోరియాలో గుణశేఖర్ అసలేం చూపించబోతున్నారో చూడటానికి అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే సినిమా తీసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా గుణశేఖర్ కి మంచి పేరు తీసుకువస్తుంది అనిపిస్తుంది. మరి.. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.
