వెలగపూడి : హైదరాబాద్లోని గుల్జార్ హౌస్లో జరిగిన విషాదకర అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన చెందారు. మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ ఘటనపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. హైదరాబాద్ లోని చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు దుర్మరణం పాలవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. భవనం మొదటి అంతస్తులో చెలరేగిన మంటల్లో చిన్నారులు, మహిళలు సహా పలువురు మరణించడం విషాదకరమన్నారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని ట్విట్టర్లో పోస్టు చేశారు.