Gravity Affect – ఆస్ట్రోనాట్స్​ సునీతా, విల్మోర్​కు ఆరు సవాళ్లు

జీరో గ్రావిటీని అధిగమించాల్సిందే
భూమి గురుత్వాకర్షణకు సెట్​ కావాలి
నార్మల్​ కావాలంటే 45 రోజులు ఆగాల్సిందే
నాసా పర్యవేక్షణలోనే ట్రీట్​మెంట్​, ఎక్సర్​సైజులు
అంతరిక్షంలో నడక లేక మృధువుగా మారిన పాదాలు
స్పేస్​ కాస్మిక్​ రేడియేషన్​కు గురయ్యే చాన్స్​
గుండె ఆకారంలోనూ మార్పులు
మున్ముందు ఎన్నో కఠిన సవాళ్లు

సెంట్రల్​ డెస్క్​, ఆంధ్రప్రభ : ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌స్టేషన్‌లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్‌ సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌ భూమిపైకి చేరుకున్నారు. చాలాకాలం పాటు రోదసీలో గడిపిన వీరిద్దరు భూమిపైకి తిరిగి రావడం అంత సులభమేమీ కాలేదు. ఇద్దరూ కొత్తగా నడవడం నేర్చుకోవాల్సిందే. తమ శరీరాన్ని భూమి గురుత్వాకర్షణకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఇద్దరినీ 45 రోజుల పాటు నాసా జాన్సన్‌ స్పేస్ సెంటర్‌లో ఉంచి పరీక్షిస్తారు. ఎప్పటికప్పుడు ఇద్దరి ఆరోగ్యంలో వచ్చే మార్పులను పర్యవేక్షించనున్నారు. భూమి వాతావరణంలోని సవాళ్లను ఎదుర్కొన్న తర్వాతనే సునీతా, విల్మోర్​ వారి ఇండ్లకు చేరుకుంటారు.

ఐఎస్‌ఎస్‌ నుంచి రిలీజ్‌ చేసిన వీడియోలు, ఫొటోల్లో వ్యోమగాములు గాలిలో తేలుతున్నట్లుగా కనిపిస్తుంటారు. ఐఎస్‌ఎస్‌ నుంచి భూమిపైకి తిరిగి వచ్చిన సందర్భంలో విభిన్న సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూక్ష్మ గురుత్వాకర్షణలో ఎక్కువసేపు ఉండడంతో వ్యోమగాముల ఎముకలు, కండరాలను ప్రభావితం అవుతాయి. దీన్నే మసిల్‌ ఆట్రఫీగా, బ్యాలెన్స్‌ ఇష్యూగా పిలుస్తారు. వ్యోమగాములు నడిచేందుకు.. స్పందించేందుకు సమయం పడుతుంది. ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నడవలేకపోవడం, మానసిక సందిగ్ధత తదితర తీవ్రమైన సమస్యల బారినపడే చాన్స్‌ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌ అనేక శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశీలకులు అంటున్నారు.

స్పేస్‌ అనీమియా..

స్పేస్‌టూర్‌ల సమయంలో వ్యోమగాముల్లో కనిపించే సమస్య స్పేస్‌ అనీమియా (రక్తహీనత) కనిపిస్తుంది. భూమిపై గురుత్వాకర్షణ శరీరం అంతటా రక్తం, ద్రవాలను పంపిణీ చేసేందుకు సహాయపడుతుందని ఢిల్లీలోని సీకే బిర్లా హాస్పిటల్‌కు చెందిన ఇంటర్నల్‌ మెడిసన్‌ చీఫ్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ నరేంద్ర సింఘాల్‌ తెలిపారు. అంతరిక్షంలో అలా జరుగదని.. శరీర ద్రవాలు తల వైపు కదులుతాయని.. ఈ మార్పు రక్తం పరిమాణం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయన్నారు.

బేబీ ఫీట్‌..

వ్యోమగాములు బేబీ ఫీట్‌ సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా అరికాళ్లపై మందపాటి చర్మం ఉంటుంది. అయితే.. స్పేస్‌లోకి వెళ్లిన వ్యోమగాముల అరికాళ్ల మందపాటి చర్మం పోయి.. శిశువుల తరహాలో మృదువైన చర్మం వస్తుంది. దాంతో భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములు నవడవడం కష్టతరమవుతుంది. దీన్ని అధిగమించేందుకు వ్యోమగాములు రీహాబిలిటేషన్‌కు వెళ్తారు. ఇక్కడ ఉపరితలంపై చెప్పులు లేకుండా నడవడం, అసౌకర్యాన్ని తగ్గించేందుకు పాదాలకు మసాజ్‌, పాదాల కండరాలు తదితర సమస్యల నుంచి బయటపడేందుకు వ్యాయామాలు చేయిస్తారు.

మాట్లాడడం కూడా ఇబ్బందే..

అంతరిక్షంలో వ్యోమగాములు బరువు కోల్పోతారు. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో గాలిలో తేలినట్లుగా ఉంటుంది. ఇది నాలుక, పెదవులను ప్రభావితం చేస్తుంది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత కొన్నిరోజుల పాటు సరిగా మాట్లాడలేకపోతారు. ఎక్కువ కాలం స్పేస్‌లో ఉన్నవారు ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఎముకల కదలికల్లో నొప్పి ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

కాస్మిక్‌ రేడియేషన్‌..

స్పేస్‌ కాస్మిక్‌ కిరణాలు, మన సౌర వ్యవస్థ వెలుపల నుంచి అధిక శక్తి కణాలు.. శరీరంలోకి ప్రవేశించి సెల్యులార్ డీఎన్‌ఏను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. వాతావరణం, అయస్కాంత క్షేత్రం రక్షణ కవచాన్ని అందించే భూమిలా కాకుండా.. అంతరిక్షంలో వ్యోమగాములు హానికారక కిరణాల ప్రభావం పడుతుంది. ఎక్కువ కాలం ఈ కిరణాల ప్రభావంతో మార్పులు సంభవిస్తాయి. కేన్సర్‌తో పాటు ఇతర జన్యుపరమైన రుగ్మతల ప్రమాదం పెరుగుతుంది. తొమ్మిది నెలల్లో సునీతా విలియమ్స్‌ దాదాపు 270 ఎక్స్‌ కిరణాలకు సమానమైన రేడియేషన్‌ లెవల్స్‌ను ఎదుర్కొన్నారు.

ఎత్తు పెరుగుతారు..

అంతరిక్షంలో వ్యోమగాములు కాస్త ఎత్తు పెరుగుతారు. ఆస్ట్రోనాట్స్‌ వెన్నుముక పెరుగుదల కారణంగా అంతరిక్షంలో కొన్ని అంగుళాల వరకు పొడువు పెరుగుతారు. అయితే, భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత తాత్కాలికంగా స్పేస్‌లో పెరిగిన ఎత్తు తగ్గుతుంది. కానీ, వెన్నుముక సర్దుబాటు సమయంలో తరుచూ వెన్నుముక సమస్యలు ఎదురవుటాయి.

గుండె ఆకారంలో మార్పులు..

స్పేస్‌లో గుండె పనిభారం తగ్గుతుంది. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రక్తాన్ని పంప్‌ చేయడానికి భూమిపై ఉన్న సమయంలో కష్టపడాల్సిన అవసరం గుండెకు ఉండదు. దాని కారణంగా గుండెలో నిర్మాణాత్మక మార్పులు సంభవిస్తాయి. అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాముల హృదయాలు దాదాపు 9.4శాతం కంటే ఎక్కువగా గోళాకారంగా మారుతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఆకారంలో వచ్చిన మార్పు తక్షణం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించకపోయినప్పటికీ.. గుండె పంపింగ్‌ సామర్థ్యాన్ని మాత్రం తగ్గిస్తుంది. దాంతో భూమిపైకి ఆస్ట్రోనాట్స్‌ తిరిగి వచ్చిన తర్వాత గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. ఈ క్రమంలో ఆస్ట్రోనాట్స్‌ భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత గుండె సంబంధిత చికిత్సలు అందిస్తారు.

ఐఎస్‌ఎస్‌ అంటే ఏమిటి, ఎక్కడుంది?

ఐఎస్‌ఎస్‌ అంటే.. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌. భూమికి 409 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఇదో ప్రత్యేకమైన ప్రయోగశాల వంటిది. దీనికి విండో ఉంటుంది. ఇందులో నుంచి 360 డిగ్రీల్లో చూడొచ్చు. ఈ స్పేస్‌ స్టేషన్‌లో ఆరు బెడ్‌రూంలు, రెండు బాత్‌రూలు, ఒక జిమ్ ఉన్నాయి. నాసా, రోస్కోస్మోస్‌, సీఎస్‌ఏ, జాక్సా సంయుక్తంగా ఈ ఐఎస్‌ఎస్‌ను రూపొందించాయి. ఇది 108 మీటర్ల పొడవు ఉంటుంది. ఎనిమిది స్పేస్‌ షటిల్స్‌ ఉండొచ్చు. భూమి నుంచి స్పేస్‌స్టేషన్‌కు చేరుకునేందుకు నాలుగు గంటల సమయం పడుతుంది. భూమి నుంచి 50 కంపూటర్ల ద్వారా పర్యవేక్షిస్తారు. ఐఎస్‌ఎస్‌ 24గంటల్లో భూమి చుట్టూ 16 సార్లు చుట్టి వస్తుంది. ఒకేరోజు 16 సూర్యదోయాలు, సూర్యాస్తమాయాలను చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *