Grand | చారిత్రక వైభవానికి చిరునామా బెల్లంపల్లి స్టేషన్..

Grand | చారిత్రక వైభవానికి చిరునామా బెల్లంపల్లి స్టేషన్..

  • నేడు సౌకర్యాల లేమితో సతమతం!
  • నత్తనడకన ప్లాట్‌ఫారమ్ పనులు..
  • లిఫ్ట్, రెండో కాలిబాట వంతెనకై ప్రయాణికుల నిరీక్షణ
  • దక్షిణ మధ్య రైల్వే నిర్లక్ష్యంపై ‘ఆంధ్రప్రభ’ ప్రత్యేక కథనం

Grand | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో శతాబ్ద కాలపు చరిత్ర కలిగిన బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాజీపేట జంక్షన్ తర్వాత అంతటి పేరుగాంచింది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ స్టేషన్, ఢిల్లీ-చెన్నై గ్రాండ్ ట్రంక్ లైన్‌(Grand Trunk Line)పై అత్యంత కీలకమైన కూడలి.

అద్భుతమైన నిర్మాణ శైలి, గోడలపై కళాఖండాలు, సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలతో రాజభవనాన్ని తలపించే ఈ స్టేషన్ నేడు అధికారుల ఉదాసీనత వల్ల దుస్థితికి చేరుకుంది.

బెల్లంపల్లి స్టేషన్ పైనే కాక, చుట్టుపక్కల ఉన్న తాండూర్, నెన్నెల, కాసీపేట, కన్నెపల్లి, భీమిని, తిర్యాణి, దేవాపూర్, వేమనపల్లి, మందమర్రి వంటి పదికి పైగా మండలాల ప్రయాణికులు ఇక్కడ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు.

నిత్యం వేలాది మంది ప్రయాణికులు, సుమారు 12 నుంచి 14 రైలు పట్టాలతో నిరంతరం గూడ్స్ రైళ్ల(goods trains) రాకపోకలతో కిటకిటలాడే ఈ స్టేషన్‌లో కనీస వసతులు లేకపోవడం విచారకరం.

ప్రస్తుతం స్టేషన్‌లో రెండో ప్లాట్‌ఫారమ్‌ను తొలగించి, దాని స్థానంలో మూడో ప్లాట్‌ఫారమ్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఈ పనులు అత్యంత నత్తనడకన సాగుతుండటంతో రైళ్ల కోసం వేచి చూసే ప్రయాణికులు నిలబడటానికి కూడా చోటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్లాట్‌ఫారమ్‌ల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫారమ్ నుండి మరొక దానికి వెళ్లడానికి ప్రస్తుతమున్న ఒకే ఒక కాలిబాట వంతెన సరిపోవడం లేదు.


• రెండో వంతెన : రద్దీని దృష్టిలో ఉంచుకుని తక్షణమే రెండో కాలిబాట వంతెనను నిర్మించాలి.
• లిఫ్ట్ & ఎస్కలేటర్ : వృద్ధులు, దివ్యాంగులు, భారీ సామానుతో వెళ్లే వారి కోసం లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ సౌకర్యం కల్పించాలి.
• వెయిటింగ్ రూమ్స్ : కొత్తగా నిర్మిస్తున్న 2, 3 ప్లాట్‌ఫారమ్‌లలో ప్రయాణికుల కోసం వెయిటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలి.
• సమాచార వ్యవస్థ : రైళ్ల రాకపోకల వివరాలు తెలిపే టీవీలు, డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలి.

వర్షాలకు భవనం పెయింటింగ్ రాలిపోయి కళాఖండాలు దెబ్బతిన్నాయి. స్టేషన్ పేరు సూచించే బోర్డులు తుప్పుపట్టి, నాలుగు భాషల్లోని అక్షరాలు స్పష్టంగా కనబడక కొత్త ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, ఇంతటి చరిత్ర ఉన్న స్టేషన్‌లో ప్రధాన ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లు(superfast trains) ఆగకపోవడం ఈ ప్రాంత ప్రజలను నిరాశకు గురిచేస్తోంది.

రైల్వే అధికారులు బెల్లంపల్లి చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రధాన రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ కల్పించి స్టేషన్ పూర్వ వైభవాన్ని కాపాడాలని కోరుతున్నారు.

Leave a Reply