వడివడిగా ధాన్యం కొనుగోళ్లు…

- 12-24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం సొమ్ము..
- క్షేత్రస్థాయిలో రైతన్నను చేయిపట్టి నడిపిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం..
- సరళీకృత విధానంపై రైతుల ప్రశంసలు..
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రైతుల క్షేమం, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. ప్రతి రైతుకూ తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా చేయూతనిస్తోంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వడివడిగా విజయవంతంగా ముందుకు సాగుతోంది.
ఎవరికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయం, పౌర సరఫరాలు, సహకార తదితర శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
లక్ష్యాలకు అనుగుణంగా….
ఈ ఖరీఫ్ సీజన్‌లో ధాన్యాన్ని మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు రైతుల నుంచి నేరుగా సజావుగా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్‌కే) ద్వారా ఈ ప్రక్రియ ముందుకెళ్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 17న ప్రారంభమైన కొనుగోళ్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో రైతు హితంగా సాగుతోంది.
తిరువూరు డివిజన్‌లో 44, నందిగామ డివిజన్‌లో 18, విజయవాడ డివిజన్‌లో 17 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ధాన్యాన్ని సేకరించేందుకు సుమారు 18,75,000 గోనె సంచులు అవసరం కాగా, ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 12,00,700 గోనె సంచులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తిరువూరు డివిజన్‌లో 7,09,400, విజయవాడ డివిజన్‌లో 3,50,200, నందిగామ డివిజన్‌లో 1,41,100 గోనె సంచులను అందుబాటులో ఉంచారు.
గతం కంటే మిన్నగా….
2024-25 ఖరీఫ్ సీజన్‌లో నవంబర్ నెల వరకు మొత్తం 7,430 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు రూ. 49.70 కోట్ల విలువైన 20,818 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిన దగ్గరి నుంచి 12-24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం సొమ్ము జమవుతుండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అడుగు అడుగునా తడబాటు లేకుండా పటిష్ట ప్రణాళికతో పనిచేస్తుండటం వల్ల ఇది సాధ్యమైంది. వాహనాల వినియోగంలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది.
గత ఖరీఫ్ ప్రధాన సీజన్‌లో 433 వాహనాలు నమోదు కాగా, ప్రస్తుత సీజన్‌లో మొత్తం 1,347 జీపీఎస్ వాహనాలు నమోదయ్యాయి. వీటిలో తిరువూరు డివిజన్‌లో 485, విజయవాడ డివిజన్‌లో 369, నందిగామ డివిజన్‌లో 493 వాహనాలు ధాన్యం రవాణాకు అందుబాటులో ఉన్నాయి.
