Governor | 99 పైసలకే భూములపై స్పష్టత ఇవ్వని అధికార పక్షం

Governor | 99 పైసలకే భూములపై స్పష్టత ఇవ్వని అధికార పక్షం

  • పెన్షన్లు, తల్లికి వందనం అమలులో గందరగోళం..
  • శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ

Governor | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : శాసనమండలిలో ప్రతిపక్ష పార్టీ అడుగుతున్న ప్రశ్నలకు కనీస సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు 99 పైసలకే భూములు కేటాయిస్తున్న అంశంపై శాసనమండలిలో ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కీలక అంశాలపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా స్పష్టత ఇవ్వకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు.

వైఎస్సార్ హయాంలోనే విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశామని, అప్పుడే ఆదానీ డేటా సెంటర్ కూడా రాష్ట్రానికి వచ్చిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం 99 పైసలకే భూములు ఇస్తామంటూ కంపెనీలకు లాలూచీ పడటం వెనుక ఏం ఉందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేశారన్న ఆరోపణలపై కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని అన్నారు.

ఒకవైపు 5 వేల కోట్ల భూములున్నాయన్న విమర్శలు వస్తే, గీతం సంస్థ మాత్రం వెయ్యి కోట్ల భూములే తమ వద్ద ఉన్నాయని చెబుతోందని, అసలు నిజం ఏంటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. పెన్షన్ల అంశంపై ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదని, గవర్నర్ ప్రసంగం సందర్భంగా అధికారపార్టీ సభ్యులు డప్పులు కొట్టడం తప్ప ప్రజల సమస్యలపై మాట్లాడలేదని విమర్శించారు. ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం కింద 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, వాస్తవంగా అందరికీ అందించిందా అని ప్రశ్నిస్తే మౌనం వహించిందని చెప్పారు.

తల్లికి వందనం డబ్బులు పూర్తిగా తల్లుల ఖాతాల్లో జమ కాలేదని, చాలా మంది ఖాతాల్లో ఏడెనిమిది వేల రూపాయలే వచ్చాయని పేర్కొన్నారు. తాము చెప్పిన విషయాలు అవాస్తవమని ప్రభుత్వం నిరూపిస్తే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. 15 సంవత్సరాల పాటు తాను కూడా మంత్రిగా పనిచేశానని, వివరాలు లేకుండా ఏ అంశాన్నీ ప్రతిపక్షం ప్రశ్నించదని అన్నారు. ప్రభుత్వం కావాలంటే అధికారులతో విచారణ చేయించుకుని తాము చెప్పింది అసత్యమని నిరూపించాలని సవాల్ విసిరారు.

Governor |

ఈ సమావేశాలు ముగిసేలోపు తల్లికి వందనం బకాయిలను పూర్తిగా చెల్లించాలని, ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలను కనీసం పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొత్తగా ఒక్క వితంతు పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని, గతంలో వైసిపి పాలనలో ఏడాదికి రెండు సార్లు కొత్త పెన్షన్లు మంజూరు చేశామని గుర్తుచేశారు. శాసనమండలిలో తాను లేవనెత్తిన ప్రతి అంశానికి కట్టుబడి ఉన్నానని ఆయన సమాధానం చెప్పారు.

Leave a Reply