రైతులను పట్టించుకోని ప్రభుత్వం

రైతులను పట్టించుకోని ప్రభుత్వం

  • మక్కల అమ్మకాలు పూర్తయ్యాక కాంటాలు
  • పంటలకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందే
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

ఉమ్మడి నిజామాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా(Nizamabad District) భీంగల్ మండలంలో జరిగిన జాతర సంధర్భంగా లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లింబాద్రి నరసింహస్వామి చాలా పవర్ ఫుల్ దేవుడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చాను. లింబాద్రి దేవుడి దయ వల్ల నిజామాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరినట్లు కవిత చెప్పారు. భీంగల్ ప్రాంతానికి రాష్ట్రంలో కీలకమైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. భీంగల్ మండలానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌(Mahesh Kumar Goud)తో పాటు బాల్కొండ నియోజకవర్గంలో మరో ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా ఉన్నారని చెప్పారు.

ఇక్కడి ఎమ్మెల్యే ఎవరన్నది పక్కన పెడితే.. రూలింగ్ పార్టీదే నడుస్తోంద‌న్నారు. అయినప్పటికీ మక్కలు 80 శాతం అమ్మకాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు కాంటా పెడుతున్నారు. ఇది దారుణం, అన్యాయం అన్నారు. తడిసిన వరి కూడా కొంటలేరు. కొంటామని కూడా చెప్పటం లేదన్నారు. మొన్న నేను యంచ గ్రామానికి వెళ్లిన తర్వాత కలెక్టర్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేశారు. అలాగే అన్ని చోట్లకు వెళ్లాలని కోరుతున్నానన్నారు. కొన్ని చెక్ డ్యామ్ లు( Check Dams) డ్యామేజ్ అవటంతో బాల్కొండ నియోజకవర్గంలో పంట పొలాలు మునిగాయి.

వారికి పంట నష్టం ఇస్తామని ప్రభుత్వం ధైర్యం చెప్పటం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా కనీసం ప్రభుత్వాన్ని నిలదీస్తలేవు. ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని నిలదీయాలి. రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయాలి కోరారు. కేసీఆర్ లక్ష్మీ నరసింహా స్వామి భక్తుడు. గతంలో లింబాద్రి స్వామి వారికి రూ. 5 కోట్లు కేటాయించారు. దాంతో గుడిని అభివృద్ధి చేసుకున్నామ‌న్నారు.

ఐతే మహిళలకు టాయిలెట్స్, ఛేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. గుట్ట కింద అడ్మినిస్ట్రేటివ్(Administrative) ఆఫీస్ పూర్తి కావటానికి రూ. 20 లక్షలు అవసర‌మ‌న్నారు. ప్రభుత్వం వాటిని కేటాయించాలన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధి కి కృషి చేయాలని కవిత డిమాండ్ చేశారు.

Leave a Reply