SPORTS | ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీ*

- క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకోవాలి
- మారథాన్ పోటీ నిర్వహణతో దేశవ్యాప్తంగా జిల్లా ఖ్యాతి
SPORTS | ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : హనుమకొండలో వరంగల్ ట్రై సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హాఫ్ మారథాన్ పోటీల ప్రారంభోత్సవంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పాల్గొన్న రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కెఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, తదితరులు.

కాళోజి కళా క్షేత్రం వద్ద మారథాన్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
ఆదివారం ఉదయం నాయిని విశాల్ ఫౌండేషన్, క్రెడాయి వరంగల్, తెలంగాణ రన్నర్స్, కియాన్ ఇన్ ఫ్రా సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ ట్రైసిటీ హాఫ్ మారథాన్-2025ను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరాం రెడ్డి, నిర్వాహకులు విష్ణువర్ధన్ రెడ్డి, తదితరుల సమక్షంలో హాఫ్ మారథాన్ పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంపొందించు కోవాలన్నారు. జీవితంలో సంతోషంగా ఉండాలని.. సంతోషంగా ఉంచాలని పేర్కొన్నారు. క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను రాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. హనుమకొండలో నిర్వహిస్తున్న మారథాన్ పోటీలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తించాలని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా రాష్ట్రంలోనే 4వ క్రీడా పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు కేటాయించారని తెలిపారు.

యువత, విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకే ఒత్తిడి, న్యూనతకు లోనవుతున్నారని అన్నారు. మత్తు వదిలి మైదానాలకు చేరాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో క్రీడా పాలసీని అమలు చేస్తున్నారని, దీంతో రాష్ట్రంలోని వేలాది మైదానాలను క్లీన్ చేస్తున్నామని పేర్కొన్నారు.
క్రీడాకారులను తీర్చిదిద్దే విధంగా అంతర్జాతీయ కోచ్ లను తీసుకువచ్చి క్రీడల్లో విద్యార్థులు, యువత రాణించే విధంగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడి నుండే దేశానికి, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేలా చేస్తామన్నారు. మారథాన్ లో పాల్గొంటున్న క్రీడాకారులు నీలిరంగు టీ షర్టులు ధరించి పరిగెడుతుంటే వరంగల్ కు బ్లూ పెయింట్ వేసినట్టు ఉందన్నారు.

మారథాన్ నిర్వహణతో మంచి వాతావరణాన్ని జిల్లా నుండి రాష్ట్రానికి తద్వారా దేశానికి పరిచయం చేసినట్లయిందని అన్నారు. తాను రంజీ గేమ్స్ ఆడుతున్న సమయంలో తన తల్లిదండ్రులు ఎందుకు ఆటలాడుతున్నావని తిట్టేవారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ పిల్లలు ఎందుకు ఆటలు ఆడడం లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారని అన్నారు. తమ పిల్లలను క్రీడల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు.
విజయ డెయిరీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. దాదాపు 35 కోట్ల రూపాయలతో విజయ డెయిరీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
నాయిని విశాల్ ఫౌండేషన్, ఇతర సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మారథాన్ నిర్వహించినందుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులకు అభినందనలు తెలిపారు.
