మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశం.

మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశం.
జూలూరుపాడు పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.
జూలూరుపాడు, ఆంధ్రప్రభ : వేసవి ఎండలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు,తాగునీటికి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఫార్మసీలో మందుల నిల్వలు, వైద్యులు, సిబ్బంది పనితీరు, పిహెచ్సి పరిసరాలను కలెక్టర్ అంకిత్ పరిశీలించారు.మొదటగా ఇన్‌పేషెంట్ వార్డును సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స, వైద్య సిబ్బంది పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఔట్ పేషెంట్ విభాగం పరిశీలన సందర్భంగా కొత్తూరు పంచాయతీ,చిన్న హరిజన వాడకు చెందిన వృద్ధుడు దంసలపూరి గంటయ్య తనకు ఎవరూ లేరని, ప్రమాదంలో కాలు కోల్పోయనని సహాయం చేయాలని కలెక్టర్ ను కోరారు.

సానుకూలంగా స్పందించిన అంకిత్ వృద్ధుడు గంటయ్య కు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి,కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇన్‌పేషెంట్ విభాగంలో వడదెబ్బ కారణంగా కేసులు నమోదవుతున్నట్లు గుర్తించిన కలెక్టర్, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలలో భాగంగా మండల పరిధిలో చలివేంద్రాలు ఏర్పాటు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎంపీడీవో తాళ్లూరి రవిని కలెక్టర్ ఆదేశించారు.
వేసవి ఎండలు పెరిగాయని వేడి తాపం నుంచి ఉపశమన చర్యలు తీసుకోవటంలో ఇప్పటికే ఆలస్యమైందని, తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఔషధ నిల్వలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్‌లో నమోదైన ఔషధాల వివరాలు, ప్రస్తుతం ఉన్న నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. ఔషధాల నిల్వలు ప్రజల అవసరాలకు సరిపడినంత ఉన్నాయా ,లేవా అనే విషయంపై వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న మందులు విలువైనవని, పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలన్నారు.
బహిరంగ మార్కెట్లో మందుల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోను చేయకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించే ముఖ్య కేంద్రాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని,అత్యవసర పరిస్థితుల్లో సత్వరమే స్పందించాలన్నారు. ఔషధాలు, వైద్య పరికరాలు రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించటం ప్రభుత్వం బాధ్యతని కలెక్టర్ తెలిపారు. వేసవి కాలంలో వడదెబ్బ,నీరసం వంటి సమస్యలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అవసరమైన మందులు, ఓఅర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది హాజరు, బాధ్యతలు, సేవల సమయపాలనపై వివరాలు తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తూమాటి శ్రీనివాస్, ఎంపీడీవో తాళ్లూరి రవి, పిహెచ్సి వైద్యలు డాక్టర్ వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
