- 50 శాతం రాయితీ.. దరఖాస్తుల స్వీకరణ
- ఏపీ ఆగ్రోస్ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు
అమరావతి, ఆంధ్రప్రభ: వ్యవసాయం అధునాతన సాంకేతిక పద్దతులను అనుసరించేందుకు రైతులకు యాంత్రీకరణ పరికరాలను అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం) పథకం ద్వారా యంత్ర పరికరాలపై భారీ రాయితీలు అందించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. కూలీల కొరతను అధిగమించటంతో పాటు సాగు పెట్టుబడి తగ్గుదల, దిగుబడుల పెంపుకు యాంత్రీకరణ పరికరాలు దోహదం చేస్తాయని అధికారులు చెబుతున్నారు.
ముందుగా ఏ పంటకు ఏ యంత్రాలను వినియోగించాలి, ఒక్కొక్క యంత్ర వినియోగంపై రైతులకు అవగాహన కలిగింటచంతో పాటు- పరికరాల కొనుగోలుకు ఆసక్తి గల రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రైతు సేవా కేంద్రాల్లోని ఎన్‌ఐసీ వెబ్ సైట్లోని వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ల ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఎస్‌ఎంఏఎం పథకం కింద 50 శాతం సబ్సిడీపై ఐదెకరాల లోపు వ్యవసాయం చేసే ఎస్సీ, ఎస్టీ, మహిళ, సన్న, చిన్న కారు రైతులకు పరికరాలను అందచేస్తున్నారు. ఒక కటుంబంలో ఒకరికి మాత్రమే సబ్సిడీ వచ్చేలా నిబంధన విధించారు.
ఐదేళ్ళలో ఒకసారి మాత్రమే ఈ పథకం కింద పరికరాలు అందచేయనున్నారు. ఐదేళ్ల లోపు రాయితీ కింద పరికరాలు తీసుకుని ఉంటే మళ్ళీ దరఖాస్తు చేయటానికి అనర్హులు. సబ్సిడీ కోసం రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూనే దానికి సమాంతరంగా గడిచిన అరు సీజన్ల (రబీ, ఖరీఫ్)లో ఈ-క్రాప్‌లో నమోదైన రైతులకు ప్రాధాన్యతిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఏఐడీసీ) పర్యవేక్షనలో ఏపీ ఆగ్రోస్ ద్వారా రాయితీలపై రైతులకు పరికరాలు అందచేయనున్నారు. వ్యవసాయంలో కీలకంగా ఉపయోగించే ట్రాక్టర్ ఆధారిత స్పేయ్రర్లు, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్, రోటా వేటర్, పవర్ వీడర్లు (5బీహెచ్ పీ), బ్రష్ కట్టర్లు, పవర్ టిల్లర్స్, సాధారణ స్పేయర్లను 50 శాతం సబ్సిడీకీ అర్హత కలిగిన రైతులకు ఎస్‌ఎంఏఎం పథకం ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పథకం కింద గత ఏడాది లక్ష్యాలను ఈనెలాఖరులోపు అధిగమించి 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోని సబ్సిడీ ధరలకు పరికరాలు అందించే ప్రక్రియ ప్రారంభించనున్నట్టు సమాచారం.