మధిరలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు..

మధిర, ఆంధ్రప్రభ ; పట్టణంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం క్రైస్తవులు పలు చర్చల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం చర్చిలో ఉదయం నుంచే ప్రార్థనా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజు గుర్తుగా విశ్వాసులు ఉపవాసం పాటిస్తూ, పట్టణంలో ప్రధాన వీధుల్లో శిలువ మార్గంను ఆచరించారు. ఈ సందర్భంగా ఆర్సీఎం చర్చి ఫాదర్ రమేష్ మాట్లాడుతూ, గుడ్ ఫ్రైడే క్రైస్తవుల జీవితంలో అత్యంత పవిత్రమైన రోజు అని తెలిపారు.
యేసుక్రీస్తు మనుషుల పాపాల విమోచన కోసం తన ప్రాణాన్ని అర్పించిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన సూచించారు. ప్రేమ, కరుణ, త్యాగం అనే విలువలను జీవితంలో ఆచరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సహన భావం పెంపొందించుకోవాలని, ద్వేషాలకు తావులేకుండా జీవించాలనే సందేశాన్ని గుడ్ ఫ్రైడే ఇస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు.
