సరస్వతీ అమ్మవారు భక్తుల‌కు ద‌ర్శ‌నం

సరస్వతీ అమ్మవారు భక్తుల‌కు ద‌ర్శ‌నం

బాసర, సెప్టెంబర్ 27, ఆంధ్ర ప్రభ : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో శారదీయ (దసరా) శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఆరవరోజు కాత్యాయనీ అవతారంలో సరస్వతీ అమ్మవారు దర్శనం ఇచ్చారు. కాత్యాయని ‘కత్య అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేస్తే అతనికి కూతురుగా జన్మించింది.కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు.

ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమి నాడు మహిషాసురుణ్ని వధిస్తుంది. ఈమె స్వరూపం, దివ్యం, భవ్యమూ, బంగారు వన్నెతో మెరుస్తూ ఉంటుంది. నాలుగు భుజాలతో కుడిచేతులలో అభయముద్రనూ, వరదముద్రనూ కలిగి ఉంటుంది. కాత్యాయనీ అమ్మవారికి అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో పూజలు చేసి అమ్మవారికి రవ్వ కేసరి, అల్లం గారెలు నైవేద్యంగా సమర్పించారు. తెలంగాణ, మహారాష్ట్ర నుండి వచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకొని తమ చిన్నారులకు ఆలయ సన్నిధిలోని అక్షరాబ్యాస మండపంలో ఆలయ అర్చకులచే అక్షరాబ్యాస పూజలు జరిపించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Leave a Reply