సరస్వతీ అమ్మవారు భక్తులకు దర్శనం
బాసర సెప్టెంబర్ 26 (ఆంధ్ర ప్రభ) : నిర్మల్ (Nirmal) జిల్లా బాసర జ్ఞాన సరస్వతీదేవి సన్నిధిలో శరదీయ నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఐదవ రోజు స్కందమాత రూపంలో సరస్వతీ అమ్మవారు ( Saraswati Devi) దర్శనమిచ్చారు. స్కంద భగవానుడి తల్లి అయినందున అమ్మవారి ఈ రూపానికి స్కందమాత అని పేరు వచ్చింది.
సింహవాహనం (simhavanam) పై కూర్చొని చేతిలో కమలం, జలకలశం, గంట ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా స్కందుడు (కుమారస్వామి) ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. స్కందమాతను ఆరాధిస్తే సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయ వేద పండితులు, అర్చకులు అమ్మవారికి వేద మంత్రాలతో విశేష అర్చన నిర్వహించి పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.