- అట్టహాసంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు….
- ఇంద్రకీలాద్రిపై సరికొత్త శ్రావణ శోభ…
- సువర్ణ శోభితంగా అమ్మవారి ఆలయ అలంకరణ…
- భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం…
- పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళ భక్తులు…
- అమ్మ దర్శనం కోసం బారులు తీరిన భక్తులు..
- కిటకిటలాడుతున్న క్యూ లైన్లు…
- అన్ని మార్గాల ద్వారా ఉచిత దర్శనం..
- భక్తులకు తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ..
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ముగ్గురమ్మల మూలపుటమ్మ… కోరిన కోరికలు తెచ్చే కొంగుబంగారం.. పరమ మహిమాన్వితమైన ఆ కనకదుర్గమ్మ (Kanakadurgamma) వారు వరలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా సువర్ణ శోభితంగా పలు రకాల పూలతో అలంకరించారు. అమ్మవారి ప్రధానాలయంతో పాటు ఉప ఆలయాలు అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. వరలక్ష్మి దేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రి (Indrakeeladri) కి తరలిరావడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసాయి. ప్రధానాలయంలో శ్రీ అమ్మవారు శ్రీ లక్ష్మీ దేవిగా అలంకరణ చేసి, ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 9:30 నిమిషాల నుండి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. క్రమక్రమంగా భక్తులు రాక పెరుగుతున్న పరిస్థితుల్లో రూ 100, 300, 500 టికెట్లను రద్దు చేసిన అధికారులు అందరికీ ఉచిత దర్శన భాగ్యాన్ని కల్పించారు.
అలాగే అంతరాలయ దర్శనాన్ని రద్దుచేసి బంగారు వాకిలి ద్వారా అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఎండ తీవ్రత కాస్త ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల లో తాగునీరు అందించడంతో పాటు, చల్లటి మజ్జిగ (Cold buttermilk) ప్యాకెట్లను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించినందుకు చర్యలు తీసుకున్న అధికారులు అసిస్టెంట్ కమిషనర్ రంగారావు (Ranga Rao) సారధ్యంలో పూర్తి అప్రమత్తతతో సామాన్య భక్తులకు శీఘ్రదర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా భక్తులకు త్వరగా అమ్మవారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
ప్రారంభమైన పవిత్రోత్సవాలు…
విజయవాడ (Vijayawada) లోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గ మల్లేశ్వరి స్వామి వార్ల దేవస్థానంలో పవిత్ర ఉత్సవాలు అత్యంత వైభవంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 8వ తేదీ నుండి 29వ తేదీ వరకు మూడు రోజులు పాటు నిర్వహించే ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా పాత యాగశాలలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మొదటిరోజు శుక్రవారం స్థానాచార్యులు వి.శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వైదిక కమిటీ సభ్యులు పవిత్రలకు తొలి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ శినా నాయక్ (EO Sheena Nayak) కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మంత్రోచ్ఛరణల మధ్య పవిత్ర మాలలను అమ్మవారితో పాటు ఉప ఆలయాల్లోని దేవత మూర్తులకు అలంకరించారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగిన అపచారాలు పూజలలో లోపాలు, దోషాలను నివారించేందుకు ఈ వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహిస్తుంటారు. దోష నివారణ లోపాలను సరిచేయడం సర్వ యజ్ఞ ఫలప్రద అన్ని యజ్ఞల ఫలితాలను పొందడం వంటి అనేక ప్రయోజనాలను (Many benefits) ఈ పవిత్రోత్సవాలు సమకూరుస్తాయి. ఈ పవిత్రస్వాల్లో భాగంగా నలుపు, నీలం, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులతో పట్టు లేదా పత్తి దారాలతో తయారుచేసిన పవిత్రాలను వినియోగిస్తారు. పవిత్రాలు చెడు శక్తుల నుండి రక్షిస్తాయని నమ్మకం. పురాణాల ప్రకారం పవిత్ర రోహణం అంటే ఈ పవిత్ర మూలాలను దేవతలకు అలంకరించడం. ఇది పవిత్రస్వాలలో అత్యంత ముఖ్యమైన ఆచారం. దేవస్థానంలో భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని శాంతిని అందించడంతో పాటు లోక కళ్యాణాన్ని కోరుతూ ఈ పవిత్రోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు.