Gloriously | ముక్కోటి ఏకాదశి వేడుకలు..

Gloriously | ముక్కోటి ఏకాదశి వేడుకలు..
Gloriously | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కదిరి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి వేడుకలు భక్తి పారవశ్యంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చి బారులుగా నిలిచారు. ఆలయంలో స్వామివారికి ఉదయం ప్రత్యేక అభిషేకాలు, అలంకార పూజలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 3.30 గంటలకు ఉత్తర గోపురం ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు ఎంతో శ్రద్ధాభక్తులతో ఎదురుచూశారు. ఈ సందర్భంగా “గోవిందా.. నరసింహా..” అనే నామస్మరణలతో కదిరి పట్టణం మారుమోగింది.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ఉపవాస దీక్షలతో, పూజా సామగ్రితో ఆలయానికి చేరుకున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధి, భక్తుల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట మాట్లాడుతూ.. హిందూ ధార్మికతను చాటి చెప్పే విధంగా ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాధాన్యతను మరింత బలోపేతం చేసే దిశగా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. క్యూలైన్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టామని పేర్కొన్నారు. ముఖ్యంగా రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ సహకారంతో క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయంలో చేసిన ఏర్పాట్ల పై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో కూడిన దర్శనం, సౌకర్యవంతమైన ఏర్పాట్లు, స్వచ్ఛమైన పరిసరాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని పలువురు భక్తులు తెలిపారు. మొత్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు కదిరిలో ఆధ్యాత్మిక శోభతో, భక్తి వైభవంతో ఘనంగా ముగిశాయి.
