Global Summit | పెట్టుబడుల వెల్లువతో కొత్త శకానికి నాంది

Global Summit | పెట్టుబడుల వెల్లువతో కొత్త శకానికి నాంది

Global Summit | సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్(Global Summit) ఘ‌నంగా ముగిసింద‌ని, పెట్టుబడుల వెల్లువతో కొత్త శకానికి నాంది ప‌లికింద‌ని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి అన్నారు. స‌మ్మిట్ ముగింపు సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ బ్రాండ్‌కు నూత‌నోత్సాహం వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.

మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని మాట్లాడారు. చివరి రోజు రాత్రి జరిగిన ఈవెంట్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలు, గిన్నిస్ వరల్డ్ రికార్డు బ్రేకింగ్ డ్రోన్ షో(Drone Show)తో సదస్సు ముగింపు ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి.

ఈ సమ్మిట్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఐటీ, ఇంధనం, ఆరోగ్యం వంటి కీలక రంగాలపై 27 సెషన్‌లు జరిన‌ట్టు ఆమె వెల్ల‌డించారు. ఇందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ), ప్రపంచ బ్యాంక్ వంటి ప్రధాన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నార‌ని చెప్పారు. సమ్మిట్ ముగింపులో “తెలంగాణ రైజింగ్ 2047(Telangana Rising 2047)” విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన‌ట్టు వెల్ల‌డించారు.

గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయిన‌ సంద‌ర్భంగా నిర్మలా జగ్గారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రపంచ పెట్టుబడి, ఆవిష్కరణల కేంద్రంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌(Brand Image)ను మ‌రింత పెంచిందని అన్నారు.

Leave a Reply