Ghantasala | ఘనంగా శ్రీకృష్ణ దేవరాయల మహోత్సవం…

Ghantasala | ఘనంగా శ్రీకృష్ణ దేవరాయల మహోత్సవం

ఇది తెలుగు జాతికి శ్రీకృష్ణ దేవరాయల మహోపకారం స్మరించుకునే మహోత్సవం..
శ్రీకాకుళంలో శ్రీకృష్ణ దేవరాయల వారి ఉత్సవాల్లో జస్టిస్ యూవీ దుర్గాప్రసాద్
ఆంధ్ర మహా విష్ణువు దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాలు

Ghantasala | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఇది తెలుగు జాతికి శ్రీకృష్ణ దేవరాయల మహోపకారం స్మరించుకునే మహోత్సవం అని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వ హై పవర్ కమిటీ చైర్మన్ జస్టిస్ యూవీ దుర్గాప్రసాద్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఘంటసాల మండలంలో శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో దివి ఐతిహాసిక మండలి ఆధ్వర్యంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక కృషితో రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన శ్రీకృష్ణ దేవరాయ మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన జస్టిస్ యూవీ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాయల వారి పేరు వింటే తెలుగు వారు పులకరిస్తారన్నారు.

బహు భాషా కోవిదుడైన శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్ర మహా విష్ణువు స్వప్నంలో ఇచ్చిన ఆదేశాలతో తెలుగు భాషలో ఆముక్త మాల్యద ప్రబంధ కావ్య రచనను ఈ దేవస్థానంలో గావించటం, ఆ మహా కావ్యం పంచ మహా కావ్యాల్లో ఒకటిగా ఖ్యాతి పొందటం ఈ గ్రామ ప్రజలకు గర్వకారణం అన్నారు. తెలుగు భాష పరిరక్షణ ప్రతి తెలుగు వారి కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారు.అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు జాతి చరిత్ర శ్రీకాకుళం నుంచే ప్రారంభమైందని, మొదటి ఆంధ్ర రాజులు శ్రీకాకుళం నుంచే పరిపాలన ప్రారంభించారని తెలిపారు. 1518 ఫిబ్రవరి 11న శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాకుళం వచ్చిన సందర్భంగా 2007నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ ఉత్సవాలను నిర్లక్ష్యం చేసినా, కూటమి ప్రభుత్వ సహకారంతో మళ్ళీ ప్రారంభించినట్లు తెలిపారు. బహు భాషా సామ్రాజ్య అధిపతి అయినప్పటికీ దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఆంధ్ర మహా విష్ణువు కలలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలుగులో ఆముక్త మాల్యద ప్రబంధ కావ్యం రచించటమే కాకుండా తన సామ్రాజ్యంలో తెలుగును పాలనా భాషగా చేసి గౌరవించిన గొప్ప రాజు శ్రీకృష్ణ దేవరాయలు అని తెలిపారు.

వేటూరి సతీమణికి సన్మానం:

స్వర్గీయ వేటూరి సుందర రామమూర్తి సతీమణి వేటూరి మహాలక్ష్మమ్మకు జస్టిస్ దుర్గాప్రసాద్, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వేటూరి సుందర రామమూర్తి రచించిన సిరికాకొలను సిన్నది నృత్య రూపకం అద్భుతంగా ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి మహాశ్రీ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జున్, ఏఎంసీ చైర్మన్లు కొల్లూరి వెంకటేశ్వరరావు, తోట కనకదుర్గ, దోనేపూడి శివరామయ్య, మాజీ ఏఎంసీ మాజీ చైర్మన్ తుమ్మల చౌదరి బాబు, ప్రముఖ అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ప్రముఖ కవి గుడిసేవ విష్ణుప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, గ్రామ సర్పంచ్ ముప్పనేని రవిప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు, తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), నియోజకవర్గ కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

శ్రీకృష్ణ దేవరాయలకు ఘన నివాళి:

ముందుగా ముఖ్య అతిధి జస్టిస్ దుర్గాప్రసాద్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శ్రీకాకుళేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఆముక్తమాల్యద మండపంలో కొలువై ఉన్న శ్రీకృష్ణదేవరాయల వారికి, ఆంధ్ర నాయక శతక రచయిత కాసుల పురుషోత్తమ కవికి ఘన నివాళి అర్పించారు. వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీకృష్ణదేవరాయల వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ముగ్గుల పోటీల విజేతలకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చేతుల మీదుగా తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా) నగదు బహుమతులు అందించారు. కార్యక్రమానికి శ్రీకాకుళం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీకృష్ణదేవరాయల వారి సాంస్కృతిక మహోత్సవాన్ని తిలకించారు.

Leave a Reply